తెలంగాణలో గ్రూప్-4 పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఆలస్యంగా వచ్చిన అభ్యర్ధులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించలేదు అధికారులు.
హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-4 పరీక్ష శనివారంనాడు ప్రారంభమైంది. 8,180 ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇవాళ గ్రూప్-4 పరీక్ష నిర్వహిస్తుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. గ్రూప్-4 పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తుంది టీఎస్‌పీఎస్‌సీ.
గ్రూప్-4 పరీక్షలకు 9.51 లక్షల మంది అభ్యర్ధులు హాజరు కానున్నారు. ఇవాళ ఉదయం, మధ్యాహ్నం గ్రూప్ -4 పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ -1 పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి పేపర్-2 పరీక్ష ప్రారంభం కానుంది. ప్రతి పరీక్షకు రెండు గంటల ముందే అభ్యర్ధులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు..గ్రూప్-4 పరీక్షల నిర్వహణకు గాను 2,878 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.పరీక్షకు 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేశారు. పరీక్ష రాసే అభ్యర్ధులు తమ వెంట ఫోటో గుర్తింపు కార్డును తెచ్చుకోవాలని టీఎస్‌పీఎస్‌సీ సూచించింది.
హల్ టికెట్టు , గుర్తింపు కార్డు పరిశీలించిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్ధులను అనుమతించారు.వాచ్, హ్యాండ్ బ్యాగ్, పర్సులకు అనుమతివ్వలేదు. షూ వేసుకున్న అభ్యర్ధులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు.
గ్రూప్-4 పరీక్ష కేంద్రాలకు సమీపంలోని జీరాక్స్ కేంద్రాలను మూసివేశారు. పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్ధులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల వద్ద ఆలస్యంగా వచ్చిన అభ్యర్ధులు పరీక్షకు అనుమతించాలని అభ్యర్ధించారు. హైద్రాబాద్ నిజాం కాలేజీ పరీక్ష కేంద్రం వద్ద ఆలస్యంగా వచ్చిన అభ్యర్ధులు ఆందోళనకు దిగారు. పరీక్ష రాసేందుకు అనుమతివ్వాలని కోరారు. మరో వైపు నిజామాబాద్ లో ఆలస్యంగా వచ్చిన అభ్యర్ధులను పోలీసులు వెనక్కి పంపారు.