మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు రాష్ట్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రతను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ్టి నుండి ఈటల రాజేందర్ కు భద్రతను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది.
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు వై కేటగిరి భద్రతను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం నుండి ఈటల రాజేందర్ కు వై కేటగిరి భద్రత కేటాయించనుంది కేసీఆర్ సర్కార్.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను హత్య చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సుఫారీ ఇచ్చారని ఈటల జమున ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈటల రాజేందర్ భద్రత విషయమై తెలంగాణ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. మూడు రోజుల క్రితం మేడ్చల్ డీసీపీ సందీప్ రావు ఈటల రాజేందర్ ఇంటి వద్ద భద్రతను పరిశీలించారు. ఈటల రాజేందర్ తో కూడ సందీప్ రావు చర్చించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ భద్రత విషయమై తెలంగాణ డీజీపీకి మేడ్చల్ డీసీపీ సందీప్ రావు నివేదికను అందించారు. ఈ నివేదిక ఆధారంగా ఈటల రాజేందర్ కు రాష్ట్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రతను కేటాయించింది. ఇవాళ్టి నుండి భద్రత సిబ్బంది ఈటల రాజేందర్ కు సెక్యూరిటీ కల్పించనున్నారు.
బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు, 16 మంది సెక్యూరిటీ సిబ్బంది ఈటల రాజేందర్ కు భద్రతను కల్పించనున్నారు. గతంలో కేసీఆర్ మంత్రివర్గంలో ఈటల రాజేందర్ మంత్రిగా పనిచేశారు ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఆయనను కేసీఆర్ మంత్రివర్గం నుండి తప్పించారు. బీఆర్ఎస్ నాయకత్వం కూడ ఈటల రాజేందర్ పై వేటేసింది. దీంతో ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు.
బీజేపీలో చేరడానికి ముందు హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇదే స్థానం నుండి గతంలో ఈటల రాజేందర్ పై కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. కౌశిక్ రెడ్డికి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవితో పాటు విప్ పదవిని కట్టబెట్టారు.
also read:ఈటల భద్రతపై డీజీపీకి నివేదిక: మాజీ మంత్రితో మేడ్చల్ డీసీపీ భేటీ
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో కౌశిక్ రెడ్డి మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు సవాళ్లు విసురుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా కౌశిక్ రెడ్డిని ఆ పార్టీ బరిలోకి దింపే అవకాశం ఉందనే ప్రచారం కూడ సాగుతుంది. దీంతో కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఈ తరుణంలో ఈటల రాజేందర్ ను హత్య చేయించేందుకు పాడి కౌశిక్ రెడ్డి సుఫారీ ఇచ్చారని ఈటల జమున ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈటల రాజేందర్ కు వై కేటగిరి భద్రతను కేటాయించింది.