తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు... పోలింగ్ కు సర్వం సిద్దం

By Arun Kumar PFirst Published Mar 14, 2021, 7:51 AM IST
Highlights

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ తో పాటు వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానానికి మొత్తం 164 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరి భవితవ్యం ఇవాళ బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కానుంది.

తెలంగాణలో రెండు గ్రాడ్యేయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.  ఇందులో భాగంగా ఇవాళ(ఆదివారం) రెండు స్థానాల పరిధిలోని ఆరు జిల్లాల పట్టభద్రులు ఓటు హక్కుకు వినియోగించుకోనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ తో పాటు వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానానికి మొత్తం 164 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరి భవితవ్యం ఇవాళ బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కానుంది. ఓట్ల లెక్కింపు ఈనెల 17న జరగనుంది.

ఇవాళ ఉదయం 8గంటల నుండి సాయంత్రం 4గంటల  వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. కరోనా నిబంధనలను అనుసరించి ఓటర్లను పోలింగ్ బూత్ లోకి అనుమతించనున్నారు. రెండు స్థానాల్లోనూ అత్యధికంగా అభ్యర్ధులు ఫోటీలో నిలవడంతో బ్యాలెట్‌పేపర్‌ దినపత్రిక సైజులో వుండనుంది. 
 
ఎన్నికల విధుల్లోమొత్తం 7,560 మంది సిబ్బంది ఉన్నారు. అలాగే 15 వేల పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు సీఈవో శశాంక్ గోయల్ తెలిపారు. ప్రతి గ్రాడ్యుయేట్ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని గోయల్ కోరారు. 

 హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్ధానంలో 3,36,256 పురుషులు, 1,94,944 మహిళలు, 68 మంది థర్డ్ జెండర్ మొత్తంగా 5,31,268  గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఈ మూడు జిల్లాల పరిధిలో మొత్తం 799 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.  

ఇక వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానంలో  పురుషులు 3,32,634, మహిళలు 1,72,864, థర్డ్‌జండర్‌ 67 మొత్తం 5,05,565 మంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మూడు జిల్లాల్లో 731 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటుచేశారు. 
 
 

click me!