Republic Day: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖైదీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సుదీర్ఘంగా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను మానవత్వం చూపుతూ సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంతమందిని విడుదల చేశారంటే..?
Republic Day: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జైలులో సుధీర్ఘకాలం శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జైలులో నుంచి సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జైళ్లలో సత్ప్రవర్తన ప్రదర్శించిన 212 మంది జీవిత ఖైదీలు, 19 మంది జీవితేతర ఖైదీలతో కూడిన 231 మంది ఖైదీలను ముందస్తుగా విడుదల చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం జనవరి 26 శుక్రవారం ప్రకటించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 ద్వారా గవర్నర్‌కు ఇచ్చిన అధికారాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకోబడింది.
ఆర్టికల్ 161 ప్రకారం.. రాష్ట్ర గవర్నర్ కు ప్రత్యేక అధికారాలుంటాయి. ఈ మేరకు ఖైదీలకు క్షమాభిక్ష కల్పించడం, శిక్షల నుంచి ఉపశమనం కల్పించే అధికారం ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15), గాంధీ జయంతి (అక్టోబర్ 2), గణతంత్ర దినోత్సవం (జనవరి 6) రోజున సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తుంటారు. ఈ మూడు సందర్భంగాల్లో ఖైదీలను విడుదల చేస్తుండగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు రెండు సార్లు ఖైదీలను విడుదల చేసింది.
పదేళ్ల తెలంగాణలో ఖైదీలను ముందస్తుగా 2016, 2020లో విడుదల చేశారు. గతంలో 400 మందిని విడుదల చేశారు. తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయడం ఇదే తొలిసారి. అనారోగ్యం, వయోభారం, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారి శిక్షను తగ్గించడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఖైదీల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.