చదువుతో పాటే సంపాదన.. తెలంగాణ సర్కార్ వినూత్న ఆలోచన, ఆ కాలేజీల్లో అమలు

By Siva KodatiFirst Published Apr 25, 2023, 2:29 PM IST
Highlights

వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను ప్రవేశపెట్టాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. దీని కింద తొలుత పది కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో ఎప్పటికప్పుడు మార్పులు రావాలని నిపుణులు, మేధావులు చెబుతుంటారు. ఈ విషయంలో ప్రభుత్వాలు సైతం వేగంగానే స్పందిస్తున్నాయి. చదువుకుంటూనే చాలా మంది విద్యార్ధులు పార్ట్‌టైం జాబ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని వల్ల తల్లిదండ్రులకు ఆర్ధిక భారం తగ్గడంతో పాటు విద్యార్ధులు తన ఖర్చులకు తానే సంపాదించుకున్నట్లుగా వుంటుంది. పాశ్చాత్య దేశాల్లో ఇదే కల్చర్ అమల్లో వున్న సంగతి తెలిసిందే. భారత్‌లోనూ ఈ తరహా పోకడలు వస్తున్నాయి. 

ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్ధులు చదువుకుంటూనే, నెలకు రూ.10 వేలు సంపాదించే అవకాశాన్ని కల్పించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం తెలంగాణలో 1,054 డిగ్రీ కాలేజీలు వుండగా.. విద్యార్ధుల అడ్మిషన్లు బాగా వునన 103 కాలేజీల్లో ఈ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. 

Latest Videos

దీని కింద తొలుత పది కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తారు. ‘‘సెక్టార్ స్కిల్ కౌన్సిల్’’ సహకారంతో ఈ కోర్సులను నిర్వహించనున్నారు. సంబంధిత పరిశ్రమలతో కాలేజీలు, సెక్టార్ స్కిల్ కౌన్సిల్‌లు ఒప్పందం చేసుకుంటాయి. ఒక కోర్సు కింద గరిష్టంగా 60 మంది విద్యార్ధులను చేర్చుకుంటారు. దీని కింద అడ్మిషన్ పొందిన విద్యార్ధులు మూడు రోజులు కాలేజీలో, మిగిలిన మూడు రోజులను తనకు సంబంధించిన రంగానికి చెందిన పరిశ్రమలో ఇంటర్న్‌షిప్ చేయాల్సి వుంటుంది. ఇందుకు గాను నెలకు రూ.10 వేలు వేతనం చెల్లిస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్ధులకు ప్లేస్‌మెంట్స్ సైతం కల్పిస్తారు. 
    

click me!