
పీఆర్‌సీ ప్రకటించకపోతే పోరుబాట పడతామంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పీఆర్‌సీ పొడిగింపుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉద్యోగ నేతలు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ని కలిశారు. ఈ నెలాఖరుకు పీఆర్‌సీ నివేదిక వస్తుందని సీఎస్ హామీ ఇచ్చారని నేతలు తెలిపారు.
త్వరలోనే మరోసారి చీఫ్ సెక్రటరీతో భేటీ అవుతామని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. వేతన సవరణకు సంబంధించి అన్ని ఉద్యోగ సంఘాల నేతలతో తాము మాట్లాడినట్లు ఉద్యోగ సంఘం నేత రవీందర్ రెడ్డి తెలిపారు. పీఆర్‌సీపై ఇప్పటికే నివేదిక తుది రూపుకు వచ్చిందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కొత్త పీఆర్‌సీ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ కొత్త పీఆర్‌సీ నివేదిక ఇంకా ప్రభుత్వానికి చేరలేదు. ఈ తరుణంలో కొత్త పీఆర్‌సీ కోసం ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు.
Also Read:తెలంగాణ ఉద్యోగులకు నిరాశ: పీఆర్‌సీ గడువు డిసెంబర్ 31వరకు పొడిగింపు
కొత్త పీఆర్‌సీ నివేదిక ప్రభుత్వానికి చేరేలోపుగా కనీసం మధ్యంతర భృతిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. గత ఏడాది నవంబర్ మాసంలోనే పీఆర్‌సీపై నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. కానీ, ఇంతరకు నివేదిక ఇవ్వలేదు.
70 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే పీఆర్‌సీపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఇంకా అందలేదు. దీంతో పీఆర్‌సీపై వారం పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినా కూడ నివేదిక అందలేదు.
దీంతో పీఆర్‌సీ గడువును ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.అయితే సాంకేతిక సమస్యల కారణంగానే పీఆర్‌సీ కమిటీ గడువును పెంచినట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Also Read:తెలంగాణ విద్యాశాఖలో సర్క్యులర్ కలకలం: ఐఎఎస్‌పై బదిలీ వేటు
సీఆర్ బిశ్వాల్ నేతృత్వంలో పీఆర్‌సీ కమిటీ 2018 మేలో ఏర్పాటైంది. అయితే పీఆర్‌సీ కమిటీ గడువును పెంచుకొంటూ పోతోంది.2019 ఆగష్టు నాటికి పీఆర్‌సీ నివేదిక ఇవ్వాల్సి ఉంది. కానీ, సకాలంలో నివేదిక అందలేదు.
మరో వైపు కమిటీ మరోసారి గడువును పెంచుకొంటూ వెళ్లింది.దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీకి పెంచుతూ ప్రభుత్వం జారీ చేసింది. అయితే మరో వారం రోజుల పాటు నివేదిక అందాల్సి ఉంది. కానీ నివేదిక ఇంకా అందలేదు.పీఆర్‌సీ గడువును డిసెంబర్ 31వ తేదీకి వాయిదా వేశారు.