
హైదరాబాద్ పంజాగుట్టలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంబేద్కర్ జయంతి(ఏప్రిల్ 14) పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో విగ్రహ ఏర్పాటు పనులను స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విగ్రహ ఏర్పాటుకు సంబంధించి చాలా ఏండ్లుగా డిమాండ్ ఉందని గుర్తుచేశారు. దీనిపట్ల మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నామని తెలిపారు.
ఇక, హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాలనే డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనమంతరావు పదే పదే ఈ డిమాండ్‌ను వినిపిస్తూ వస్తున్నారు. ఈ డిమాండ్‌తో గతంలో దీక్షకు దిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంబేడ్కర్ విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించకుంటే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఈ విషయంలో వీహెచ్ ప్రభుత్వ పెద్దలను కూడా కలిశారు. ఈ ఏడాది జనవరిలో పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా సీఎల్పీనేత భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం సీఎస్ శాంతికుమారిని కోరింది. ఇక, ఫిబ్రవరిలో తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు కలిశారు. అసెంబ్లీలో కేటీఆర్‌తో భేటీ అయిన భట్టివిక్రమార్క, వీహెచ్.. పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహం చేయాలని కోరారు.