హైదరాబాద్ కేంద్రంగా మూడు జోన్లు, మూసీ ప్రక్షాళన .. రేవంత్ సర్కార్ తొలి బడ్జెట్‌లో భాగ్యనగరంపై ఫోకస్

By Siva Kodati  |  First Published Feb 10, 2024, 2:16 PM IST

రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను గురువారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో హైదరాబాద్ నగరానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. హైదరాబాద్ కేంద్రంగా జోన్లు, మూసీ ప్రక్షాళన, ఐటీ రంగం అభివృద్ధి వంటి వాటికి ప్రాధాన్యతను ఇచ్చారు. 


రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గాను గురువారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో హైదరాబాద్ నగరానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. సిటీని మూడు జోన్లుగా విభజించి.. అభివృద్ధి ప్రణాళికలు రచిస్తామని, అన్ని ప్రాంతాలు సమానంగా వృద్ధిలోకి తీసుకురావటానికి త్వరలోనే విధి విధానాలు కార్యాచరణ ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా అభివృద్ధి చేస్తామని.. అర్బన్ జోన్‌గా ఔటర్ రింగ్ రోడ్ లోపల ప్రాంతం, పెరి అర్బన్ జోన్‌గా ఓఆర్ఆర్ - ఆర్ఆర్ఆర్ మధ్య ప్రాంతం , గ్రామీణ జోన్‌గా ఆర్ఆర్ఆర్ అవతలి ప్రాంతం వుంటాయని ఆయన పేర్కొన్నారు. 

అలాగే ఒకప్పుడు హైదరాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చి నేడు మురికికూపంగా మారిన మూసీ నది ప్రక్షాళనకు సైతం బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. దీనిలో భాగంగా మూసీ ప్రక్షాళనకు రూ. 1000 కోట్లు కేటాయిస్తున్నట్లు భట్టి వెల్లడించారు. 56 కిలోమీటర్ల పొడవునా మూసీ నది ప్రక్షాళనతో పాటు దాని వెంట గ్రీన్ పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు కోసం బ్రిటన్ ప్రభుత్వ ప్రతినిధులతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు భట్టి వెల్లడించారు.

Latest Videos

undefined

యూకే రాజధాని లండన్‌లోని థేమ్స్ నది తరహాలోనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీటిలో పీపుల్స్ ప్లాజా, చిల్ట్రన్స్ పార్కులు, పాదచారుల జోన్లు ఏర్పాటు చేయనున్నారు.  చార్మినార్, ట్యాంక్ బండ్ తరహాలో మూసీ ప్రాజెక్ట్‌ను నగరానికి ఓ మణిహారంగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. 

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ రంగానికి మరింత ఊతాన్ని ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఐటీ రంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం నూతన పాలసీ ఐటీని రాష్ట్ర నలుమూలలకు విస్తరించేందుకు ప్రణాళికలు తీర్చిదిద్దుతామని, ఐటీ విస్తరణకు అమెరికాలోని ఐటీ సర్వ్ సంస్థతో సంప్రదింపులు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. దేశంలోనే అత్యంత పటిష్టమైన ఫైబర్ నెట్‌వర్క్ కనెక్షన్లు వుండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని భట్టి స్పష్టం చేశారు. 
 

click me!