ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి.. తమిళిసై సీరియస్, రిపోర్ట్ ఇవ్వాలంటూ డీజీపీకి ఆదేశం

By Siva KodatiFirst Published Nov 18, 2022, 8:15 PM IST
Highlights

బీజేపీ సీనియర్ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి ఘటన తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. దీనిపై టీఆర్ఎస్- బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ స్పందించారు. 

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణుల దాడిని ఖండించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. అంతేకాకుండా ఘటనపై నివేదిక సమర్పించాల్సిందిగా డీజీపీని గవర్నర్ ఆదేశించారు. ఇంట్లో వస్తువులను పగులగొట్టడం, కుటుంబ సభ్యులను బెదిరించడం చట్ట విరుద్ధమన్నారు. 

మరోవైపు.. తమ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తల్లి విజయలక్ష్మీ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్‌కు చెందిన 50 మంది గూండాలు తమ ఇంటిపై దాడి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడికి దిగడమే కాకుండా తనను బెదిరించారని విజయలక్ష్మీ పేర్కొన్నారు. ఈ ఘటనపై విజయలక్ష్మీ మాట్లాడుతూ.. ఇంట్లో ఎవరూ లేనిది చూసి దాడి చేయడం తప్పని.. విమర్శలు చేస్తే ఇంటిపై దాడులు చేస్తారా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము దాడులకు భయపడేది లేదని విజయ లక్ష్మీ పేర్కొన్నారు.

Also REad:ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి.. టీఆర్ఎస్ నేతలపై పోలీసులకు ఎంపీ తల్లి ఫిర్యాదు

అంతకుముందు తన ఇంటిపై దాడిపై ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. దమ్ముంటే తనపై వచ్చే ఎన్నికల్లో  పోటీ చేయాలని  కవితకు సవాల్  విసిరారు. ఇంకా దొరల పాలన సాగుతుందని  అనుకొంటున్నారా  అని  ఆయన ప్రశ్నించారు. హైద్రాబాద్ లోని తన ఇంటిపై టీఆర్ఎస్  శ్రేణులు దాడి చేసి  మహిళలను  భయపెట్టారని, తన తల్లిని బెదిరించారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. నిజామాబాద్  పార్లమెంట్ లో పోటీచేస్తావా  చేయాలని  కవితకు అరవింద్ సవాల్ చేశారు. విమర్శలు చేస్తే దాడి చేస్తారా  అని  అర్వింద్ ప్రశ్నించారు

గత  పార్లమెంట్  ఎన్నికల సమయంలో  పోటీచేసిన 178 మందిలో 71 మంది పసుపు రైతులు బీజేపీలో చేరారన్నారు. తనపై చీటింగ్ కేసు  ఏం వేస్తావని  ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను  అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది టీఆర్ఎస్  అని అర్వింద్ విమర్శించారు. కేసీఆర్ పై చీటింగ్  కేసు  పెట్టాలని కవితకు  సలహా ఇచ్చారు  ఎంపీ అర్వింద్. రైతులు  గుంపులు గుంపులుగా  బీజేపీలో చేరుతున్నారన్నారు. 70 ఏళ్ల  వయస్సున్న తన తల్లిని   భయపెట్టే  హక్కు  ఎవరిచ్చారని  అరవింద్  ఆగ్రహం వ్యక్తం చేశారు.

click me!