నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారేమో... ఫాంహౌస్‌ కేసులో రాజ్‌భవన్‌ను లాగాలనే : తమిళిసై సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Nov 9, 2022, 5:22 PM IST
Highlights

ఫామ్‌హౌస్ కేసుకు సంబంధించి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు . తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు అనుమానాలున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. 

ఫామ్‌హౌస్‌ కేసులోనూ రాజ్‌భవన్‌ను లాగాలని చూశారని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులకు ఆమోదముద్ర వేయడంలో జాప్యంపై ఆమె వివరణ ఇచ్చారు. బుధవారం ఆమె రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తుషార్ గతంలో ఏడీసీగా పనిచేశారని తెలిపారు. తుషార్ పేరు ఉద్దేశ్యపూర్వకంగా తీసుకొచ్చారని తమిళిసై ఆరోపించారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు అనుమానాలున్నాయని గవర్నర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్‌హౌస్ కేసులో తొలుత తుషార్.. తర్వాత రాజ్‌భవన్ పేరును ప్రస్తావించారని తమిళిసై అన్నారు. ఏడీసీగా పనిచేసినంత మాత్రానికే రాజ్‌భవన్‌ పేరును కేసులోకి లాగుతారా అని ఆమె ప్రశ్నించారు. 

Also REad:నేనేం బిల్లుల్ని ఆపలేదు.. పరిశీలించాలిగా, ఆలస్యం అందుకే : తమిళిసై

రాజ్‌భవన్ ముందు ఆందోళన చేస్తామని జేఏసీ హెచ్చరిస్తోందని.. ఎవరొచ్చినా మాట్లాడేందుకు సిద్దంగా వున్నానని తమిళిసై స్పష్టం చేశారు. కానీ ఆందోళనలు చేసేలా వారిని ఎవరు రెచ్చగోడుతున్నారని ఆమె ప్రశ్నించారు. యూనివర్సిటీల్లో పరిస్ధితులను కళ్లారా చూశానని తమిళిసై తెలిపారు.  పిల్లలకు మెస్‌లో తినడానికి తిండి లేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీల్లో పరిస్ధితుల్ని ప్రభుత్వం మెరుగుపరచాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రగతి భవన్‌లాగా రాజ్‌భవన్ గేట్స్ మూసివేయలేదని తమిళిసై అన్నారు. తెలంగాణకు న్యాయం జరగాలని క్లారిఫికేషన్ అడిగానని ఆమె తెలిపారు. మంత్రికి అవగాహన లేకుండా మాట్లాడారని గవర్నర్ పేర్కొన్నారు. 

బిల్లుల్ని సమగ్రంగా పరిశీలించేందుకు సమయం తీసుకున్నానని అన్నారు. బిల్లుల్ని తానే ఆపానని తప్పుగా అర్ధం చేసుకున్నారని తమిళిసై వ్యాఖ్యానించారు. ఒక్కొక్క బిల్లుని కూలంకషంగా పరిశీలిస్తున్నానని.. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ బిల్లుకే తొలి ప్రాధాన్యత ఇచ్చానని గవర్నర్ స్పష్టం చేశారు. 

యూనివర్సిటీల్లో నియామకాల బిల్లును తాను ఆపుతున్నట్లు ప్రచారం చేశారని.. ఒక బోర్డు ఉండగా కొత్త బోర్డు ఎందుకని ఆలోచించానని తమిళిసై తెలిపారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని తానే డిమాండ్ చేస్తున్నట్లు గవర్నర్ వెల్లడించారు. దానికి తానేదో బిల్లుల్ని ఆపానని ప్రచారం చేశారని తమిళిసై ధ్వజమెత్తారు. ఇప్పటికే అన్ని యూనివర్సిటీ వీసీలతో మాట్లాడానని.. సమగ్ర నివేదిక రూపొందించి, ప్రభుత్వానికి పంపించానని గవర్నర్ వెల్లడించారు. కొత్తగా రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఎందుకు.. అన్నదే తన ప్రశ్న అని ఆమె స్పష్టం చేశారు. 

ఎనిమిదేళ్లుగా వీసీ పోస్టులు ఖాళీగా వున్నాయని.. తన టూర్ ప్లాన్‌కు సంబంధించి అన్ని వివరాలు ప్రభుత్వానికి పంపానని గవర్నర్ వెల్లడించారు. తాను వెళ్లినప్పుడు కలెక్టర్ ,ఎస్పీ రాలేదని ఆమె తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఎందుకు మాట్లాడదని తమిళిసై ప్రశ్నించారు. రాజ్‌భవన్ .. ప్రగతి భవన్‌లా కాదని ఆమె స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌కు ఎవరైనా రావొచ్చు.. సమస్యలు చెప్పుకోవచ్చునని గవర్నర్ తెలిపారు. 

click me!