
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భారీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజాసింగ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు.. ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని ఆయనను ఆదేశించింది. మతాలను కించపరిచే వ్యాఖ్యలు చేయవద్దని, మీడియాతో మాట్లాడం, ర్యాలీలు చేయకూడదని చెప్పింది. జైలు నుంచి విడుదలయ్యే సమయంలో ర్యాలీలు చేయవద్దని ఆదేశించింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు మాత్రమే ఉండాలని సూచించింది. మూడు నెలల వరకు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయవద్దని షరతు విధించింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని కూడా అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇక, మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై టి రాజా సింగ్‌ను పోలీసులు ఆగస్టులో అరెస్టు చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ క్రమంలోనే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు.. ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే రాజాసింగ్‌పై పోలీసుల చర్యలను రద్దు చేయాలని కోరుతూ ఆయన భార్య ఉషా భాయి హైకోర్టు ఆశ్రయించారు.
రాజా సింగ్‌పై ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం ప్రయోగించిన రెండు నెలల తర్వాత.. పిడి యాక్ట్ అడ్వైజరీ బోర్డు హైదరాబాద్ పోలీసుల నిర్ణయాన్ని సమర్థించింది. అడ్వైజరీ బోర్డు ఇచ్చిన నివేదిక ఆధారంగా సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) కార్యదర్శి వీ శేషాద్రి అక్టోబర్ 19న మెమో కూడా జారీ చేశారు.
ఇక, రాజాసింగ్ పీడీ యాక్ట్‌కు సంబంధించి హైకోర్టులో విచారణ సాగుతుంది. అయితే ఈ క్రమంలోనే ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.