
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దూరంగా వుండటం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌పై గవర్నర్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొందరు మాట్లాడతారు గానీ.. పనిచేయరంటూ వ్యాఖ్యానించారు. దేశాధినేతలనైనా కలవొచ్చు గానీ.. ఈ స్టేట్ చీఫ్‌ని మాత్రం కలవలేమని తమిళిసై సెటైర్లు వేశారు.
రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా సచివాలయ ప్రారంభోత్సవానికి తనకు పిలుపే లేదన్నారు. ప్రగతి భవన్, రాజ్ భవన్‌లు దూరం దూరంగా వుంటున్నాయని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. డెవలప్‌మెంట్ అంటే ఫ్యామిలీ కోసం కాదని.. రాష్ట్ర ప్రజలందరూ అభివృద్ధి చెందాలని తమిళిసై చురకలంటించారు. మనమంతా ప్రజల కోసం వున్నామని.. ఆ దిశగా పనిచేయాలని గవర్నర్ సూచించారు.
ALso Read: సచివాలయ ప్రారంభానికి తమిళిసైకి ఆహ్వానం రాలేదు: తేల్చేసిన రాజ్ భవన్
అంతకుముందు.. కొత్త సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు ఎలాంటి ఆహ్వానం రాలేదని రాజ్ భవన్ ప్రకటించింది. తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందినా కూడా గవర్నర్ హాజరు కాలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని గవర్నర్ తప్పు బట్టారు. కొత్త సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వం నుండి ఆహ్వానం రానందున ఈ కార్యక్రమానికి గవర్నర్ హాజురు కాలేదని రాజ్ భవన్ వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు రాజ్ భవన్ మీడియాకు ప్రకటన విడుదల చేసింది.
ఈ ఏడాది ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి 2500 మందికి ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. అయితే గవర్నర్ కు మాత్రం ఎలాంటి ఆహ్వానం రాలేదని రాజ్ భవన్ వర్గాలు తేల్చి చెప్పాయి. ప్రభుత్వం నుండి ఆహ్వానం అందనందునే గవర్నర్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని రాజ్ భవన్ వర్గాలు తేల్చి చెప్పాయి.