ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఆరా తీశారు. ఆర్టీసీ సమ్మెపై కార్మికులతో పాటు బీజేపీ నేతలు కూడ సమావేశమయ్యారు. ఈ తరుణంలో గవర్నర్ ఆరా తీయడం ప్రస్తుతం రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది.
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేరుగా రంగంలోకి దిగారు. ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ సౌందర రాజన్ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తో ఫోన్ లో మాట్లడారు.
గురువారం నాడు మధ్యాహ్నాం గవర్నర్ సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఫోన్ చేశారు. ఆర్టీసీ సమ్మె గురించి గవర్నర్ వివరాలు తెలుసుకొన్నారు. ఈ సమయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఎం కేసీఆర్ వద్ద సమీక్ష సమావేశంలో ఉన్నారు.
గవర్నర్ నుండి ఫోన్ రావడంతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రవాణా శాఖ కార్యదర్శిని గవర్నర్ వద్దకు పంపారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తీసుకొన్న చర్యల గురించి రవాణా శాఖ కార్యదర్శి వివరించనున్నారు.
ఈ నెల 5వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు సెల్ప్ డిస్మిస్ అయ్యారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సమ్మెకు సంబంధించి తెలంగాణ గవర్నర్ ను ఆర్టీసీ జేఎసీ నేతలు గవర్నర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
బీజేపీ నేతలు రెండు దఫాలు ఇదే విషయమై గవర్నర్ తమిళిసై ను కలిశారు. ఆర్టీసీకి చెందిన భూముల లీజుల విషయంలో బీజేపీ నేతలు ఈ నెల 16న గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతున్న తరుణంలో ఢిల్లీ నుండి గవర్నర్ కు పిలుపు వచ్చింది.
ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ ఆరా తీశారు. ఆర్టీసీ కార్మికులు ఈ నెల 19వ తేదీన తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి..విపక్షపార్టీలు తెలంగాణ బంద్ కు మద్దతును ప్రకటించాయి.
గవర్నర్ ఫోన్ చేయడంతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ విషయమై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ కానున్నారు. సీఎం కేసీఆర్ తో భేటీ అయిన తర్వాత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం నాడు గవర్నర్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది.ఒక వేళ ఇవాళ సీఎంతో భేటీ ఆలస్యమైతే శుక్రవారం నాడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గవర్నర్ తమిళిసై తో భేటీ అయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే ఆర్టీసీ సమ్మె విషయమై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేరుగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఫోన్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశాంగా మారింది. సాధారణంగా రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిస్థితులపై గవర్నర్లు అధికారులు, మంత్రులతో నేరుగా మాట్లాడవచ్చు.
గతంలో గవర్నర్ గా పనిచేసిన నరసింహాన్ అధికారులతో సమీక్షలు కూడ నిర్వహించారు. కొన్ని విషయాలపై నేరుగా ఆయన మంత్రులతో కూడ మాట్లాడారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను కూడ గవర్నర్ నేరుగా తనిఖీ చేసిన సందర్భాలు కూడ లేకపోలేదు.
అయితే ప్రస్తుతం గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్ ఉన్నారు. నరసింహన్ తో కేసీఆర్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. సౌందరరాజన్ గవర్నర్ కు ఇటీవలనే బాధ్యతలు స్వీకరించారు. కేసీఆర్ తో ఆమెకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో గవర్నర్ తమిళిసై మంత్రి పువ్వాడ కు ఫోన్ చేయడం ప్రస్తుతం రాజకీయవర్గాల్లో హాాట్ టాపిక్ గా మారింది.