హైద్రాబాద్ రాజ్ భవన్ లో తెలంగాణ అవతరణ వేడుకలు ఇవాళ నిర్వహించారు. 1969 తెలంగాణ యోధులకు గవర్నర్ పాదాభివందనం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ఎదగాలని కోరుకుంటున్నట్టుగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పారు. శుక్రవారంనాడు రాజ్ భవన్ లో కేక్ కట్ చేసి తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగించారు. తెలంగాణ కోసం ఎందరో ఆత్మబలిదానాలు చేసుకున్నారని గవర్నర్ గుర్తు చేశారు.
తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు పేరు పేరున ఆమె జోహర్లు చెప్పారు. తెలంగాణలో ప్రతి వ్యక్తి ఓ ఉద్యమకారుడిలా పోరాటం చేశారన్నారు.మారుమూల గ్రామాలు అభివృద్ది చెందినప్పుడే తెలంగాణ అభివృద్ది చెందుతుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రం మొత్తం అభివృద్ది చెందితేనే నిజమైన అభివృద్ది అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. తెలంగాణ అంటే హైద్రాబాద్ అభివృద్దిని మాత్రమే చూడరాదని ఆమె కోరారు. హైద్రాబాద్ అంతర్జాతీయ నగరంగా పేరు సంపాదించిందన్నారు.
undefined
also read:తమ మద్దతుతోనే తెలంగాణ : బీజేపీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో బండి సంజయ్
ప్రతి ఒక్కరం తెలంగాణ సమగ్ర, సమతుల్య సకల జనుల అభివృద్దికి పునరంకితం అవుదామని గవర్నర్ పిలుపునిచ్చారు. జై తెలంగాణ అంటే స్లోగన్ కాదు, ఆత్మగౌరవ నినాదమని గవర్నర్ చెప్పారు. దేవుడు తనను తెలంగాణకు పంపడం గొప్ప అదృష్టంగా ఆమె పేర్కొన్నారు.తాను మీతో ఉన్నాను, మీరు నాతో ఉన్నారని తెలంగాణ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు.అంతకుముందు 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ యోధులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాదాభివందనం చేశారు.