తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు బిల్లును రూపొందించి గవర్నర్ ఆమోదం కోసం పంపారు. అయితే ఇప్పటివరకు రాజ్ భవన్ నుండి ఆమోదం రాలేదు.
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇంకా ఆమోదం తెలపలేదు. ఈ బిల్లును అసెంబ్లీలో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఆర్ధికపరమైన బిల్లు కావడంతో గవర్నర్ కు పంపింది ప్రభుత్వం. అయితే ఈ బిల్లుకు ఇంకా రాజ్ భవన్ నుండి అనుమతి రాలేదు.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత నెల 31న నిర్వహించిన తెలంగాణ కేబినెట్ తీర్మానం చేసింది. ఈ నెల 1న ఈ మేరకు బిల్లును రూపొందించారు. ఈ బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇది మనీ బిల్లు కావడంతో గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వం రాజ్ భవన్ కు పంపింది. కానీ రాజ్ భవన్ నుండి ఈ బిల్లుకు ఇంకా అనుమతి రాలేదు. రాజ్ భవన్ నుండి అనుమతి వస్తే ఇవాళ ఈ బిల్లును ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. కానీ రాజ్ భవన్ నుండి అనుమతి రాకపోవడంతో ప్రభుత్వం ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టలేదు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు రేపు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. అవసరమైతే ఒక్క రోజు అసెంబ్లీ సమావేశాలను పొడిగించే అవకాశం ఉంది. ఆర్టీసీ బిల్లుకు రేపటి వరకు రాజ్ భవన్ నుండి అనుమతి వస్తే అసెంబ్లీలో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.
గతంలో గవర్నర్ ఆమోదించకుండా తిప్పి పంపిన మూడు బిల్లులతో పాటు మరో నాలుగు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేసింది. కానీ ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ నుండి అనుమతి రాలేదు.ఈ విషయమై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకొంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తెలంగాణ ఆర్టీసీలోని 43వేలకు పైగా ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని గత నెల 31న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని చాలా కాలంగా ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.ఈ డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం బిల్లును రూపొందించింది. ఈ బిల్లును ఈ నెల 1న రాజ్ భవన్ కు పంపారు అధికారులు. అయితే ఇప్పటివరకు రాజ్ భవన్ నుండి ఈ బిల్లుపై ఎలాంటి సమాచారం రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో కూడ తాము పంపిన బిల్లుల విషయంలో గవర్నర్ ఆమోదం తెలపలేదు. చాలా కాలం వరకు బిల్లులను పెండింగ్ లో పెట్టడంపై కేసీఆర్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంతేకాదు మూడు బిల్లులను ప్రభుత్వానికి తిప్పి పంపింది గవర్నర్. ఎందుకు తాను ఈ బిల్లులను తిప్పి పంపానో వివరణ ఇచ్చినట్టుగా కూడ గవర్నర్ ప్రకటించిన విషయం తెలిసిందే.