ఉద్యోగ క్యాలెండర్ విడుదలకు కసరత్తు..: నిరుద్యోగులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుభవార్త

By Arun Kumar PFirst Published Jan 26, 2022, 2:10 PM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి సిద్దంగా వుందని... జాబ్ క్యాలెండర్ విడుదలకు కార్యాచరణను రూపొందిస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెెలిపారు. 

హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం (republic day) రోజున నిరుద్యోగులకు ఊరటనిచ్చే ప్రకటన చేసారు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ (v srinivas goud). ప్రతి సంవత్సరం ఉద్యోగాల క్యాలెండర్ (job calender) ను విడుదల చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం (TRS Government) తగిన కార్యాచరణను రూపొందిస్తోందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో జోనల్ విధానం (zonal system) పూర్తి అయింది కాబట్టి ఇకపై ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నామంటూ నిరుద్యోగులకు మంత్రి శుభవార్త చెప్పారు. 

73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం కార్యాలయంలో జాతీయ జెండాను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అవకాశం కల్పించేందుకు ఉద్యోగులు సంయమనం పాటించాలని మంత్రి సూచించారు. సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి కాబట్టి మీకు ఎలాంటి అన్యాయం జరగదని అన్నారు. .  

''తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పాలన సాగిస్తున్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ తెలంగాణ దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది'' అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

తెలంగాణలో ఓవైపు ఉద్యోగుల ఆందోళన, మరోవైపు నిరుద్యోగుల ఆత్మహత్యల నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నారు. 317జీవోకు వ్యతిరేకంగా ఉద్యోగులు మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. తమకు అన్యాయం చేసేలా వున్న ఈ జీవోనే వెంటనే ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 

మరోవైపు ఉద్యోగాల భర్తీ జరక్కపోవడంతో నిరుద్యోగులు ఆందోళనకు గురయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో నిరుద్యోగ యువతీ యువకులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై గుర్రుగా వున్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు భారీ ఉద్యోగ ప్రకటన చేపట్టేందుకు కేసీఆర్ సర్కార్ సిద్దమవుతోంది. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసి దాని ప్రకారం భర్తీప్రక్రియ చేపట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఉద్యోగ క్యాలెండర్ తయారీకి కార్యచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 

ఇదిలావుంటే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్‌పై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తనపై వస్తున్న ఆరోపణలపై మంత్రి స్పందించారు. తనపై కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆమోదించిన తుది అఫిడవిట్‌నే పరిగణలోకి తీసుకుంటారని చెప్పారు. నామినేషన్లు వేశాక అఫిడవిట్ మార్చడం సాధ్యమేనా అంటూ ప్రశ్నించారు.  ఎన్నికల టైమ్ నుంచే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. 

తమకున్న ఆదరణ చూసి తట్టుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండు మీడియా చానల్స్ పనిగట్టుకుని తనపై తప్పుడు ప్రచారం చేశాయని అన్నారు. పిటిషన్‌లో ఉన్న అంశాలను ప్రచురించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కోర్టులో కేసు నడుస్తోందని అవాస్తవాలు రాశారని చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలోనే తనపై కొందరు కుట్రలు చేశారని అన్నారు. తన పేరుతో ఉన్న మరో వ్యక్తితో నామినేషన్ వేయించారని చెప్పుకొచ్చారు. కారు గుర్తును పోలి ఉన్న రోడ్డు రోలర్ గుర్తుతో పోటీ చేశారని అన్నారు. బడుగు బలహీన వర్గాల నేతలంటే పెద్ద కులానికి చెందిన ఇద్దరు నేతలకు కంటగింపుగా ఉందని ఆరోపించారు. 


 

click me!