
తెలంగాణలో ఒక వినూత్న కార్యక్రమం చేపట్టబోతున్నది సర్కారు. అదేమిటంటే చెట్లకు రిజిస్ట్రేషన్లు చేయబోతున్నది. హరిత హారం కార్యక్రమాన్ని టాప్ ప్రయార్టీగా తీసుకుంది తెలంగాణ సర్కారు. కోట్ల సంఖ్యలో మొక్కలు నాటే పని పెట్టుకుంది. కానీ వాటిని సంరక్షించకపోతే కోట్ల మొక్కలు వందల చెట్లు కూడా కావన్న ఆలోచన సర్కారుకు వచ్చింది. దీంతో మొక్కలను చెట్లుగా మార్చడమెలా అన్నదానిపై పంచాయతీరాజ్ శాఖ కసరత్తు చేసింది. ఆ కసరత్తులో భాగమే చెట్లకు రిజిస్ట్రేషన్లు.
చెట్టు-పట్టా అనే కార్యక్రమానికి ఆలోచన చేస్తున్నాం. ప్రభుత్వ స్థలాల్లో నాటే చెట్లను పేదల పేరిట రిజిస్ట్రేషన్ చేసి వారికి పట్టాలు ఇవ్వనున్నాం ఆ చెట్లపై వచ్చే ఆదాయం వారికే దక్కేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నాం అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
అయితే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఖాళీ స్థలాలు, ప్రభుత్వ సంస్థల స్థలాల్లో పండ్ల చెట్లను నాటించాలని పంచాయతీరాజ్ శాఖ ప్లాన్ చేస్తోంది. ఆయా మొక్కలను పరిరక్షించేందుకు గ్రామాల్లో భూమి లేని నిరుపేదలు, ఏ ఆదరణ లేనివారికి ఈ మొక్కల బాధ్యత అప్పగిస్తారు. అందుకోసం ప్రతి మొక్కను సంరక్షించినందుకు గాను ప్రతి నెలా ఖర్చులు కూడా చెల్లించనున్నారట.
మొక్క పెరిగి పెద్దదయ్యే వరకు సంరక్షణ ఖర్చులు ఇవ్వడంతోపాటు ఆ చెట్ల ఫలాల మీద వాటిని సంరక్షించిన వారికే అధికారాలు కల్పిస్తారట. దీంతో ప్రభుత్వ భూముల్లో, ప్రభుత్వ ఖర్చుతో మొక్కలు పెంచడం పెరిగి ఫలాలిచ్చే సమయంలో వాటిని అనుభవించే వెసులుబాటు కల్పించడం సర్కారు ఉద్దేశం అని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆలోచన మంచిదే కానీ మరి ఆచరణలో ఏం చేస్తారో చూడాలి మరి.