నయీమ్‌ ఎన్‌కౌంటర్.. ఆ పోలీసులకు సంబంధం లేదు.. సస్పెన్షన్ ఎత్తివేత

First Published Jul 6, 2018, 3:23 PM IST
Highlights

కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ నయీమ్ ఎన్‌కౌంటర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై సస్పెన్షన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ ఆరోపణలకు తగిన రుజువులు లేకపోవడంతో వీరి సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ నయీమ్ ఎన్‌కౌంటర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై సస్పెన్షన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసింది. 2016 ఆగస్టులో మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో నయీమ్‌ మరణించాడు. అతడి మరణం తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా అతను చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును విచారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది.

తొమ్మిది నెలల విచారణలో భాగంగా నయీమ్‌‌తో రాజకీయనేతలతో పాటు పలువురు పోలీస్ అధికారులకు సంబంధాలు ఉన్నట్లు తేల్చారు. వీరిలో సీఐడీ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మద్దిపాటి శ్రీనివాస్‌రావు, మీర్‌చౌక్ ఏసీపీ మల్లినేని శ్రీనివాస్‌రావు, డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ ఏసీపీ చింతమనేని శ్రీనివాస్, కొత్తగూడెం ఇన్‌స్పెక్టర్ రాజగోపాల్, సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మస్తాన్ వలీకి నయీంతో సంబంధాలున్నట్లు నిర్ధారించారు.

దీంతో ప్రభుత్వం వీరందరిని గతేడాది మేలో సస్పెండ్ చేసింది. అలాగే మరికొంతమంది పోలీసులకు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే వీరిపై వచ్చిన ఆరోపణలు రుజువుకాకపోవడంతో ఈ అధికారుల సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వీరంతా తిరిగి డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేశారు.

click me!