
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టీసీ విలీనం బిల్లు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించి అనేక ట్విస్టులు చోటుచేసుకుంటాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ టీఎస్‌ఆర్టీసీ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని వివరణలు కోరిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును పరిశీలించాల్సి ఉందని, కొంత సమయం కావాలని గవర్నర్ కార్యాలయం స్పష్టం చేసింది. ఐదు అంశాలపై ప్రభుత్వం నుంచి గవర్నర్ తమిళిసై వివరణ కోరారు. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై లేవనెత్తిన అభ్యంతరం ప్రభుత్వం వివరణ పంపినట్లు సమాచారం. అయితే దీనిపై గవర్నర్ తమిళిసై ఏ విధంగా ముందుకు సాగుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ బిల్లను గవర్నర్ ఆమోదిస్తే.. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు ఆర్టీసీ యూనియన్ నాయకులను గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ చర్చలకు రావాలని రాజ్‌భవన్‌కు ఆహ్వానించారు. ఉదయం 11.30 గంటలకు ఆర్టీసీ యూనియన్ నాయకులతో చర్చిస్తామని గవర్నర్ తెలిపారు. ప్రస్తుతం తాను పుదుచ్చేరిలో ఉండటంతో.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్టీసీ యూనియన్ నాయకులతో మాట్లాడనున్నట్టుగా గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ చెప్పారు. ఈ క్రమంలోనే 10 మంది ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను రాజ్‌భవన్ వర్గాలు లోనికి అనుమంతించాయి.
Also Read: ఆర్టీసీ విలీనం రగడ:బిల్లుపై తమిళిసై కోరిన వివరణలు ఇవే
ఇదిలాఉంటే, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ టీఎస్‌ఆర్టీసీ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని వివరణలు కోరిన సంగతి తెలిసిందే. అయితే గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆర్టీసీ బిల్లును ఆమోదించకపోతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) హెచ్చరించింది. ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్మికులు నెక్లెస్ రోడ్ నుంచి రాజ్‌భవన్ వరకు భారీ ర్యాలీగా బయలుదేరారు. అంబేడ్కర్ విగ్రహం, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా రాజ్‌భవన్ చేరుకున్నారు. రాజ్‌భవన్ ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఆర్టీసీ బిల్లను గవర్నర్ తమిళిసై ఆమోదించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.