రంగారెడ్డి జిల్లాలోని మోకిలలోని రెండో విడత ప్రభుత్వ భూముల విక్రయానికి ప్రభుత్వం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని మోకిలలో రెండో విడత ప్రభుత్వ భూముల విక్రయానికి కేసీఆర్ సర్కార్ సోమవారంనాడు నోటిఫికేషన్ జారీ చేసింది. హైద్రాబాద్ కు సమీపంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ప్రభుత్వ భూముల విక్రయం ద్వారా ఖజానాకు భారీ ఆదాయాన్ని సమకూర్చుకొనేందుకు కేసీఆర్ సర్కార్ ప్లాన్ చేసింది.
ఈ క్రమంలోనే వరుసగా భూముల విక్రయాలను చేపట్టింది. కోకాపేట భూములకు భారీగా ధరల పలికింది. దీంతో బుద్వేల్ లో కూడ ప్రభుత్వ భూముల విక్రయాన్ని చేపట్టింది కేసీఆర్ సర్కార్. మోకిల ఫేజ్ రెండో విడత భూముల విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 17న ఫ్రీ బిడ్ మీటింగ్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల 21వ తేదీ చివరి తేది.ఈ నెల 23,24, 25, 28, 29 తేదీల్లో ఈ వేలం నిర్వహించనున్నారు.
మోకిలలోని 300 ప్లాట్లకు ఈ వేలం నిర్వహించనున్నారు.300 నుండి 500 గజాల ప్లాట్లు విక్రయించనుంది ప్రభుత్వం. వేలంలో పాల్గొనే వారు తొలుత రూ. 1 లక్ష రూపాయాలు చెల్లించాలి. మోకిలలో తొలి ఫేజ్ లో గరిష్టంగా గజానికి రూ. 1.05 లక్షల ధర పలికింది. అత్యల్పంగా రూ. 70 వేలు పలికింది. తొలి ఫేజ్ లో రూ. 80వేల397 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి దక్కింది. ఈ దఫా 90 వేల గజాల భూమిని ప్రభుత్వం విక్రయించనుంది. కోకాపేటలో ఎకరం భూమికి రూ. 100 కోట్లకు పైగా ధర పలికిన విషయం తెలిసిందే. బుద్వేల్ లో కూడ ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధరను చెల్లించి కొనుగోలు చేశారు. అయితే కోకాపేటతో పోలిస్తే బుద్వేల్ భూములకు ధర పలకలేదు. మోకిల భూములకు మంచి రెస్పాన్స్ వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
also read:కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కై ప్రభుత్వ భూములు పంచుకున్నాయి: కిషన్ రెడ్డి
ప్రభుత్వ భూముల విక్రయాన్ని ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకించిన విషయాన్ని విపక్షాలు గుర్తు చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములను కేసీఆర్ సర్కార్ విచ్చల విడిగా విక్రయించడాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. ప్రభుత్వ భూముల విక్రయాన్ని తాము అడ్డుకుంటామని బీజేపీ ఇవాళ ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైద్రాబాద్ లో ఇవాళ ప్రకటించారు.