
Telangana Wineshops License : తెలంగాణ ప్రభుత్వం మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది చివరివరకు ప్రస్తుత వైన్ షాప్స్ కు గడువు ఉన్నా కాస్త ముందుగానే కొత్త లైసెన్సుల జారీకి సిద్దమయ్యింది రేవంత్ సర్కార్. 2025 డిసెంబర్ నుండి 2027 నవంబర్ వరకు కొత్త లైసెన్సులు పొందేవారు వైన్స్ నడిపించుకోవచ్చు. అయితే గతంలో రూ.2 లక్షలుగా ఉన్న వైన్స్ లైసెన్స్ ఫీజును ప్రభుత్వం రూ.3 లక్షలకు పెంచింది... దీనివల్ల ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరుతుంది.
ఇప్పటికే మద్యం దుకాణాల ఏర్పాటులో వివిధ కులాలవారికి ప్రత్యేక రిజర్వేషన్లను అమలుచేస్తోంది తెలంగాణ ప్రభుత్వం... దీన్ని ఈసారి కూడా కొనసాగించనున్నారు. వైన్స్ ల కేటాయింపులో గౌడ్ లకు15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. అంటే కొన్ని వైన్స్ లను కేవలం గౌడ్, ఎస్సి, ఎస్టి కులాలవారికే కేటాయించనున్నారు.
గత ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం మద్యం దుకాణాల ఏర్పాటుకు లైసెన్స్ లు జారీచేసిన విషయం తెలిసిందే. అప్పుడు రూ.2 లక్షల ఫీజు చెల్లించి వైన్స్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇలా లైసెన్స్ పొంది ఏర్పాటుచేసిన వైన్స్ ల గడువు త్వరలోనే ముగియనుంది. కాబట్టి కొత్త లైసెన్స్ ల జారీకి రేవంత్ సర్కార్ నోటిఫికేషన్ జారీచేసింది... డిసెంబర్ 2025 నుండి నవంబర్ 2027 వరకు కొత్త మద్యం దుకాణాల ఏర్పాటుకు ఈ నోటిఫికేషన్ ద్వారా అనుమతి పొందవచ్చు.
వైన్స్ ఏర్పాటుకోసం దరఖాస్తుచేసేవారిని లాటరీ పద్దతితో ఎంపిక చేయనున్నారు...అంటే దరఖాస్తుదారుల్లో ఎవరో ఒకరికి మాత్రమే అవకాశం వస్తుంది. మిగతావారు చెల్లించే రూ.3 లక్షల దకఖాస్తు ఫీజు నాన్ రిఫండబుల్... ఈ డబ్బంతా ప్రభుత్వానికే వెళుతుంది. జిల్లాలవారిగా వైన్స్ ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. ఒక వ్యక్తి లేదా సంస్థ ఎన్ని దరఖాస్తులయినా చేసుకోవచ్చు.