
కొత్త జోనల్ విధానం (New Zonal Policy) ప్రకారం తెలంగాణలో (Telangana) ఉద్యోగ బదిలీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న దంపతుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు(guidelines) విడుదల చేసింది. భార్యాభర్తలు ఒకే చోట పని చేసేలా ప్రభుత్వం పరిశీలన చేస్తుందని మార్గదర్శకాల్లో పేర్కొంది. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా కొత్త పోస్టింగుల్లో చేరిన తర్వాతే అప్పీలతో పాటు, భార్యాభర్తల (స్పౌస్ కేసుల) దరఖాస్తులను పరిశీలించనున్నట్టుగా తెలిపింది.
జోనల్ విధానానికి అనుగుణంగా కొత్త పోస్టింగ్‌లో చేరిన తర్వాత అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం.. జిల్లా కేడర్ ఉద్యోగులు జిల్లా శాఖాధిపతికి అప్పీల్ చేయాలి. జోనల్, మల్టీ జోనల్ కేడర్ ఉద్యోగులు శాఖాధిపతికి అప్పీల్ చేయాలి. ఇలా వచ్చిన అప్పీళ్లన్నింటినీ శాఖాధిపతులు.. సంబంధిత శాఖ కార్యదర్శికి నివేదించాలి. పూర్తి విచారణ తర్వాత త్వరితగతిన అప్పీళ్లను పరిష్కరించాలని అన్ని శాఖల కార్యదర్శులను ప్రభుత్వం ఆదేశించింది.
Also Read: యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు.. కొత్త జోనల్ ప్రకారమే ఉద్యోగుల విభజన... సీఎం కేసీఆర్
ఉద్యోగస్థులైన భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేలా స్పౌజ్ కేసులను పరిశీలించనున్నారు. శాఖాధిపతులు స్పౌజ్ కేసు దరఖాస్తులన్నింటినీ పరిశీలించి తగిన సిఫారసులతో సంబంధిత శాఖ కార్యదర్శికి నివేదించాల్సి ఉంటుంది.
ఇక, ఇటీవల జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో.. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులు మారుమూల ప్రాంతాలకు వెళ్లి పనిచేస్తేనే సమగ్రాభివృద్ది జరుగుతుందని తెలిపారు. పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. భార్యభర్తలు అయిన ఉద్యోగులు ఒకేచోట పనిచేస్తేనే వారు ప్రశాంతంగా ఉండగలరని, సమర్ధవంతంగా పనిచేయగలరని అభిప్రాయపడ్డారు. స్థానిక ఉద్యోగాలకు విఘాతం కలగకుండా స్పౌస్ కేసులను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు.