జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లికి రెండు ఆర్మీ హెలికాప్టర్లను రాష్ట్ర ప్రభుత్వం పంపింది.
హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లికి రెండు ఆర్మీ హెలికాప్టర్లను రాష్ట్ర ప్రభుత్వం పంపింది. మోరంచవాగు నీటిలో మోరంచపల్లి గ్రామం మునిగింది. దీంతో ఈ గ్రామంలో వరద పరిస్థితిపై సీఎం కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఆర్మీ హెలికాప్టర్లను గ్రామానికి పంపాలని సీఎం కేసీఆర్ సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు.
దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆర్మీ అధికారులతో మాట్లాడారు. దీంతో రెండు ఆర్మీ హెలికాప్టర్లను పంపేందుకు ఆర్మీ అధికారులు అంగీకరించారు. దీంతో రెండు ఆర్మీ హెలికాప్టర్లు హైద్రాబాద్ నుండి మోరంచపల్లికి బయలుదేరాయి. మోరంచపల్లికి సమీపంలో వాగు నీటిలో చిక్కుకున్న జేసీబీలో ఉన్న ఆరుగురిని రక్షించేందుకు ఒక హెలికాప్టర్ ను పంపనున్నారు.
also read:తెలంగాణలో భారీ వర్షాలపై కేసీఆర్ సమీక్ష:హెలికాప్టర్లకై ఆర్మీతో మాట్లాడాలని సీఎస్‌కు ఆదేశం
మరో వైపు మోరంచపల్లిలో సహాయక చర్యలకు గాను ఎన్‌డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది చేరుకుంటున్నారు. మోరంచపల్లికి సమీపంలోని కుందూరుపల్లికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు. ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ల సహాయంతో మోరంచపల్లికి చేరుకుంటారు. వరద బాధితులను బోట్ల సహాయంతో బయటకు తీసుకు రానున్నారు.మోరంచపల్లి గ్రామాన్ని వాగు నీరు ముంచెత్తడంతో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గ్రామానికి చేరుకున్నారు. వరద బాధితులకు ఆహారం, మంచినీరు అందిస్తున్నారు. ఈ గ్రామంలో పరిస్థితిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరా తీశారు. ఈ గ్రామ పరిస్థితిపై అధికారులతో మాట్లాడారు. సహాయక చర్యల గురించి అధికారులతో ఫోన్ లో చర్చించారు. రెస్క్యూ బృందాలను గ్రామానికి పంపాలని ఆదేశించారు.