ఆకాంక్ష హత్య కేసు.. ఇంకా పరారీలోనే ప్రియుడు.. కీలకం కానున్న సీసీటీవీ ఫుటేజ్..!!

Published : Jun 07, 2023, 03:58 PM IST
 ఆకాంక్ష హత్య కేసు.. ఇంకా పరారీలోనే ప్రియుడు.. కీలకం కానున్న సీసీటీవీ ఫుటేజ్..!!

సారాంశం

బెంగళూరులో తెలంగాణకు  చెందిన యువతి ఆకాంక్ష  దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.  కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

బెంగళూరులో తెలంగాణకు  చెందిన యువతి ఆకాంక్ష  దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆకాంక్ష అనుమానస్పద స్థితిలో మరణించడంతో పలు అనుమానాలు వ్యక్తం కాగా.. చివరకు ఆమె ప్రియుడు ఢిల్లీకి చెందిన అర్పిత్ ఆమెను హత్య చేసినట్టుగా తేలింది. అయితే అతడు ఇంకా పరారీలో ఉన్నాడు. అయితే ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆకాంక్ష ఫ్లాట్‌కు అర్పిత్ వచ్చివెళ్లినట్టుగా సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. వివరాలు.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నివాసం ఉంటున్న జ్ఞానేశ్వర్‌‌‌ రాజస్తాన్ వాసి. అయితే అతడు గోదావరిఖని వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. గోదావరిఖనిలోనే వ్యాపారం చేసుకుంటున్నారు. 

అతడి కూతురు ఆకాంక్ష బెంగళూరులోని కోడిహళ్లిలోని జీవన్‌భీమా నగర్‌లోని ఓ ఇంట్లో మరో యువతితో కలిసి ఉంటోంది. ఆకాంక్ష ఒక ప్రైవేట్ సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో బీఈ పూర్తి చేసిన అర్పిత్ బెంగళూరులోని ఓ సంస్థలో ఎంటర్‌ప్రైజ్ సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అయితే నాలుగు నెలల క్రితం పదోన్నతి పొందిన అతడు హైదరాబాద్‌కు బదిలీ అయ్యాడు.

అయితే రెండేళ్ల క్రితం ఆకాంక్ష, అర్పిత్‌లు పరిచయమై స్నేహితులయ్యారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. అర్పిత్ హైదరాబాద్ వెళ్లే వరకు ఇద్దరూ కలిసి ఉన్నారు. ఆ తర్వాత కోరమంగళలోని మరో ప్రైవేట్ కంపెనీలో చేరిన ఆకాంక్ష.. నవనీతతో కలిసి ఫ్లాట్‌లో ఉంటుంది. ఈ క్రమంలోనే అర్పిత్, ఆకాంక్షల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో వారు విడిపోయారు.

అయితే సోమవారం సాయంత్రం 6.15 గంటల సమయంలో ఆకాంక్ష రూమ్‌మేట్‌ నవనీత గదికి తిరిగి వచ్చేసరికి ఆమె గదిలో శవమై కనిపించింది. దీంతో నవనీత వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఫ్లాట్‌ను పరిశీలించారు. ఇందుకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు ఆకాంక్ష హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు అర్పిత్ ప్రయత్నించాడని కనుగొన్నారు. అయితే ఆకాంక్ష ఉరేసుకుని హత్య చేసుకుందనే నమ్మించేలా ప్రయత్నం చేశాడని.. బెడ్‌షీట్ తీసుకుని ఆమె మృతదేహానికి ఉరివేసేందుకు ప్రయత్నించాడని.. అయితే చివరకు  ఆమె శరీరాన్ని నేలపై వదిలి పారిపోయాడని పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకాంక్షను కలిసేందుకు అర్పిత్ సోమవారం బెంగళూరుకు వచ్చాడు. మధ్యాహ్నం 3.10 గంటలకు ఇద్దరూ కలిసి ఆమె ఫ్లాట్‌కి చేరుకున్నారు. అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీలో అర్పిత్ సాయంత్రం 4.50 గంటలకు ఒంటరిగా ఫ్లాట్ నుండి బయటకు వచ్చి 10 నిమిషాల్లో తిరిగి వస్తున్నట్లు చూపిస్తుంది. ఆ తర్వాత వెంటనే అపార్ట్‌మెంట్‌ నుంచి వెళ్లిపోయాడు. ఇక, ఆకాంక్ష ఉంటున్న ఫ్లాట్‌లో అర్పిత్ తన మొబైల్, బ్యాగ్‌ని అపార్ట్‌మెంట్‌లో వదిలేసినట్టుగా గుర్తించారు. దీంతో ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్‌ కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. 

అర్పిత్‌ను పట్టుకునేందుకు పోలీసులు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. అర్పిత్ ఇంకా బెంగళూరులోనే ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆకాంక్ష తండ్రి జ్ఞానేశ్వర్ బిద్యసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అర్పిత్‌తో ఆకాంక్షకు ఉన్న సంబంధం గురించి తమకు తెలియదని ఆమె తల్లిదండ్రులు పేర్కొన్నారు. మంగళవారం ఇందిరానగర్‌లోని సర్‌ సీవీ రామన్‌ జనరల్‌ ఆస్పత్రిలో ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. దీంతో ఆకాంక్ష మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గోదావరిఖనికి తీసుకొచ్చి.. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?