రూ.5 లక్షల యాక్సిడెంటల్, రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్.. గిగ్ వర్కర్స్ కి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Published : Nov 14, 2026, 12:34 PM IST
Rahul Gandhi

సారాంశం

గిగ్ వర్కర్స్ కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి వర్కర్ కి రూ.5 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించనున్నట్లు స్వయంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రకటించారు.

దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ, పార్శిల్ సర్వీసులు, క్యాబ్ బుకింగ్ వంటి రంగాల్లో లక్షలాది మంది పనిచేస్తున్నారు. ఎండనకా, వాననకా రోడ్లపై తిరుగుతూ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అయితే ఇలాంటి ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగ భద్రత, ఆరోగ్య రక్షణ, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలు చాలా కీలకం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గిగ్ వర్కర్లకు అందించనున్న ప్రయోజనాలను వివరించడంతో పాటు వారికి భరోసా ఇచ్చారు.

గిగ్ వర్కర్లతో కలిసి రాహుల్ గాంధీ బైక్ ర్యాలీ

హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారితో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గిగ్ వర్కర్ల వాహనాలపై ప్రయాణించారు. అనంతరం హైటెక్ సిటీలోని జయభేరి గ్రౌండ్‌లో నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు. అక్కడ గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని ప్రారంభించి, దాని ద్వారా కల్పించనున్న సదుపాయాల గురించి వివరించారు.

గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద భీమా

ఈ పథకం ద్వారా గిగ్ వర్కర్లకు సామాజిక భద్రతతో పాటు ఆర్థిక రక్షణ కల్పించడమే లక్ష్యమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రతి గిగ్ వర్కర్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల ప్రమాద భీమా అందించనుందని... రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పించనుందని తెలిపారు. పని చేసే సమయంలో ప్రమాదాలు జరిగినా, అనారోగ్య సమస్యలు ఎదురైనా ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఈ భీమా ఉపయోగపడుతుందని వివరించారు.

విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక కేంద్రాలు

గిగ్ వర్కర్లు రోజంతా రోడ్లపై తిరుగుతూ డెలివరీలు చేస్తుంటారు. ఎండ, వాన, చలి వంటి వాతావరణ పరిస్థితులను లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తుంటారు. అలాంటి వారికి కొంతసేపు విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. వైఫై సదుపాయంతో కూడిన రెస్ట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని వివరించారు.

ప్రతి డెలివరీలో 1 శాతం నిధులు.. పెన్షన్ సదుపాయం

గిగ్ వర్కర్లకు భవిష్యత్తులో ఆర్థిక భద్రత కల్పించేందుకు పెన్షన్ విధానాన్ని కూడా తీసుకురానున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. ఇందుకోసం ప్రతి డెలివరీపై వచ్చే మొత్తంలో 1 శాతం నిధులను కేటాయించే విధానం ఉంటుందని వివరించారు. ఈ డబ్బులు గిగ్ వర్కర్ల సంక్షేమ బోర్డుకు చేరుతాయని, కార్మికుల ప్రత్యేక ఖాతాల ద్వారా వారికి ప్రయోజనం కల్పించేలా ఏర్పాట్లు ఉంటాయని చెప్పారు. తద్వారా ప్రస్తుతం పనిచేస్తున్న వారికే కాకుండా భవిష్యత్తులోనూ గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత అందించాలన్నది ఈ పథకం ఉద్దేశంగా వివరించారు.

బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు

ఈ సందర్భంగా బీజేపీ విధానాలపై కూడా రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. బీజేపీ గిగ్ వర్కర్లను బాండెడ్ లేబర్‌లుగా మార్చాలని చూస్తోందని ఆరోపించారు. అంబానీ, అదానీ వంటి పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం గిగ్ వర్కర్ల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.

గిగ్ వర్కర్లు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం, తాను ఎల్లప్పుడూ వెంట ఉంటామని తెలిపారు. గిగ్ వర్కర్స్ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం బాధ్యత తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్న గిగ్ వర్కర్లకు తగిన గుర్తింపు, గౌరవం, భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ ప్రసంగంలో వివరించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : అక్వాన్ తుపాను ఏపీలో కాకుండా అక్కడ తీరం దాటిందో.. తెలంగాణలో గడ్డకట్టే చలి..!
Kurumurthi Temple: స్వామి వారికి కొత్త చెప్పులు సమర్పించే వింత ఆచారం.. ఈ ఆలయ విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు