
Guvvala Balaraju: తెలంగాణ రాజకీయం హీటెక్కింది. బీసీ వాదంతో తెలంగాణ కాంగ్రెస్ దేశరాజధాని ఢిల్లీలో ధర్నాలు చేస్తుంటే.. ప్రతిపక్ష బిఆర్ఎస్ లో లీడర్ల రాజీనామాతో కలకలం చెలరేగుతుంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Bala Raju) పార్టీకి రాజీనామా చేసి, పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా మారారు.
తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపేలా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో తాను కీలకంగా పని చేశాననీ, తనని చంపుతామని బెదిరింపులు వచ్చినప్పటికీ మాజీ సీఎం కేసీఆర్ ( KCR) పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గువ్వల బాలరాజు మీడియాతో మాట్లాడుతూ "ఫామ్ హౌస్ కేసులో వంద కోట్లు తీసుకున్నానని నాపై అపవాదులు సృష్టించారనీ, తనకు వేలాదిగా బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి ఈ విషయం చెప్పినా, తనకు రక్షణ ఇవ్వలేదని, కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాదు 2009, 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం తాను ప్రయత్నించినా బలవంతంగా ఎంపీ బీఫాం ఇవ్వాలని ఒత్తిడి చేశారని ఆరోపించారని తెలిపారు. భూ కబ్జాలు, దాడుల విషయంలో కూడా పార్టీ ఎవ్వరూ స్పందించకపోవడం తనని ఎంతగానో బాధ కలిగించిందని తెలిపారు. పార్టీ కోసం తొలినాళ్ల నుంచే పని చేస్తున్న వారిని పక్కన పెట్టడం, వేరే పార్టీ నుంచి వారికి మంత్రి పదవులు, గుర్తింపు ఇవ్వడం తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. ఉమామహేశ్వర ప్రాజెక్టును పూర్తిచేయాలని ఎన్నిసార్లు విన్నవించినా.. స్పందించిన నాథుడే కనపడలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
క్యాడర్ విజ్ఞప్తి
గువ్వల బాలరాజు మాట్లాడుతూ అచ్చంపేటలో అడుగుపెట్టినప్పుడు పార్టీకి క్యాడర్ లేకుండా తాను పని చేశాననీ, రెండుసార్లు గెలిచి ప్రజలకు సేవ చేసాననీ తెలిపారు. రాజీనామా నేపథ్యంలో కొందరు కార్యకర్తలు అతన్ని మళ్ళీ బీఆర్ఎస్‌లోకి రావాలని కోరుతూ కన్నీరు పెట్టడం అక్కడి ఉద్వేగభరిత వాతావరణాన్ని తెలియజేస్తోంది.