
Sangareddy Fire Accident: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం శివారులో ఉన్న గుబ్బ కోల్డ్ స్టోరేజ్‌లో బుధవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మంటలు భీకరంగా చెలరేగడంతో కార్మికులు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. జీడిమెట్ల, దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ల నుంచి వచ్చిన అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటల్ని అదుపు చేసేందుకు రాత్రంతా శ్రమించారు. మొదటివిడతలో వచ్చిన రెండు యంత్రాలు రాగా.. ఆ తరువాత 6 అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దించారు.
ఈ ప్రమాదంలో కోల్డ్ స్టోరేజ్‌లో నిల్వచేసిన పలు ఫార్మా పరిశ్రమల ఉత్పత్తులు, వివిధ ఆహార పదార్థాలు పూర్తిగా కాలిపోయినట్టు ప్రాథమిక సమాచారం. మంటలు రాత్రి 10 గంటలవరకూ అదుపులోకి రాలేదని తెలుస్తోంది. ఘటన స్థలానికి ఎస్సై లక్ష్మీపతిరెడ్డి చేరుకుని పోలీసులతో కలిసి బందోబస్తు, సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం జరిగినదీ స్పష్టంగా తెలియకపోయినా, నష్టం భారీగానే ఉన్నట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియకపోయినా, ఇది ప్రమాదమా? నిర్లక్షమా? కుట్ర అనేది తెలియాల్సి ఉంది.