జూలై నుండి గృహలక్ష్మి పథకం: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభించిన కేసీఆర్

By narsimha lode  |  First Published Jun 2, 2023, 11:16 AM IST

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను  సీఎం కేసీఆర్  ఇవాళ  ప్రారంభించారు.  సచివాలయంలో  జాతీయ  పతాకాన్ని  ఆయన ఆవిష్కరించారు.  
 


హైదరాబాద్: స్వంత  స్థలం ఉండి ఇళ్ళు నిర్మించుకోలేని పేదల కోసం గృహలక్ష్మి  పథకం  కింద  రూ. 3 లక్షలను అందించనున్నట్టుగా  సీఎం కేసీఆర్ ప్రకటించారు.  ఈ ఏడాది  జూలై నుండి  ఈ పథకాన్ని  రాష్ట్రంలో అమలు  చేస్తామన్నారు.

తెలంగాణ  రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని  పురస్కరించుకొని దశాబ్ది ఉత్సవాలను    తెలంగాణ  సీఎం కేసీఆర్  సచివాలయంలో  ప్రారంభించారు.  జాతీయ పతాకాన్ని  సీఎం కేసీఆర్  ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా  నిర్వహించిన  సభలో  ఆయన  ప్రసంగించారు.  గృహలక్ష్మి పథకం  కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి 3 లక్షలను మూడు దశల్లో అందిస్తామన్నారు సీఎం. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టుగా సీఎం  తెలిపారు.మహిళల పేరిట  ఈ పథకాన్ని    అమలు  చేస్తామని  సీఎం కేసీఆర్   చెప్పారు. 

Latest Videos

ఈ నెల  24 నుండి  పోడు  పట్టాల పంపిణీని  చేపడుతామని సీఎం కేసీఆర్ తెలిపారు.  గిరిజునల  చిరకాల ఆకాంక్షను నెరవేర్చే ప్రయత్నం  చేయనున్నామన్నారు.  పోడు సమస్యకు   శాశ్వాత  పరిష్కారం అందిస్తున్నామన్నారు. 

అటవీ భూములపై ఆధారపడిన ఒక లక్షా యాభైవేల మంది ఆదివాసీ, గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాల పోడు భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తామని  కేసీఆర్  వివరించారు.  ఈ భూములకు రైతు బంధును  కూడ  అందిస్తామని  సీఎం  కేసీఆర్ హామీ ఇచ్చారు.

బీసీ కుల వృత్తుల కుటుంబాలకు  కుటుంబానికి  రూ. లక్ష ఆర్ధిక సహాయం  అందిస్తున్నట్టుగా  సీఎం  కేసీఆర్ ప్రకటించారు.  ఈ పథకం ద్వారా  రజక, నాయిబ్రహ్మణ, విశ్వ బ్రహ్మణ, కుమ్మరి, మేదరి  తదితర  సామాజిక వర్గాలు  దీంతో  ప్రయోజనం పొందనున్నారని  సీఎం చెప్పారు. 

ఆరేళ్ళ స్వల్ప కాలంలోనే వాయువేగంతో రాష్ట్రం ప్రగతి శిఖరాలను అధిరోహించిందన్నారు.  దేశంలో ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా తెలంగాణ మోడల్ అనే మాట మార్మోగుతున్న విషయాన్ని  కేసీఆర్ గుర్తు  చేశారు.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అభివృద్ధి నమూనా మన్ననలందుకుంటుందన్నారు.

అనేక సవాళ్ళు, అవరోధాల మధ్య నెమ్మదిగా ప్రారంభమైన తెలంగాణ ప్రగతి ప్రస్థానం నేడు పరుగులు తీస్తోందన్నారు.  ఇందుకు  అంకితభావంతో పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం, ప్రభుత్వోద్యోగులు, ప్రజా సహకారమే కారణంగా  సీఎం  కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఇతర రాష్ట్రాలకు   ఆదర్శప్రాయంగా ఆచరణీయంగా ఉందన్నారు.  ఆయా రాష్ట్రాల ప్రజలు తమకు కూడా తెలంగాణ తరహా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారని  సీఎం  ఈ సందర్భంగా  ప్రస్తావించారు.

దళిత బంధు పథకం కింద  ఇప్పటివరకు 50 వేల మంది లబ్దిదారులకు 5 వేల కోట్ల రూపాయలను అందించినట్టుగా  సీఎం  చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్ లో ఈ పథకానికి 17,700 కోట్లు కేటాయించామన్నారు.  రెండవ విడత  లక్షా 30 వేల మందికి దళిత బంధు పథకం అందిస్తామన్నారు. 

 విద్యుత్తు రంగంలో  తెలంగాణ  విప్లవాత్మక విజయాలు సాధించిందని  ఆయన గుర్తు చేశారు. 24 గంటల పాటు, వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తు సరఫరా చేసే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని  ఆయన  చెప్పారు.వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కోసం ప్రభుత్వం ఏటా 12 వేల కోట్లు ఖర్చు చేస్తూ రైతు సంక్షేమం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుంటుందన్నారు.

మోడీ  స్వంత  రాష్ట్రం గుజరాత్ లో ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు చొప్పున పవర్ హాలిడే ప్రకటిస్తున్నారని ఆయన  విమర్శించారు.  తెలంగాణ రాష్ట్రంలో క్రాప్ హాలిడేలు, పవర్ హాలిడేలు  లేవన్నారు.తెలంగాణ ఏర్పడే నాటికి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లుంటే, నేడు ప్రస్తుతం 18,453 మెగావాట్లకు పెంచుకోగలిగినట్టుగా  కేసీఆర్  ప్రస్తావించారు.  

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 80శాతం పైగా పూర్తయిందన్నారు.. ఈ ప్రాజెక్టుతో ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలలో ప్రతి ఎకరానికీ సాగునీరు అందుతుందని సీఎం  చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో  నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టు  నిర్మాణాలు పూర్తి  చేసినట్టుగా  కేసీఆర్ తెలిపారు. 

ఉమ్మడి ఖమ్మం  జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు తుదిదశకు చేరుకున్నాయన్నారు. . త్వరలోనే ఈ ప్రాజెక్టు పూర్తిచేసి రైతుల పంట పొలాలకు సాగునీరు అందించనున్నట్టుగా  కేసీఆర్  వివరించారు.

రైతుల నుండి ఇప్పటివరకు ఒక కోటి ఇరవై ఒక లక్షల కోట్ల విలువైన ఆరు కోట్ల డెబ్భై ఆరు లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినట్టుగా  సీఎం  చెప్పారు. .  కేంద్రం నిరాకరించినా, తెలంగాణ ప్రభుత్వమే పంటను  కొనుగోలు  చేస్తుందన్నారు. 


 

click me!