తెలంగాణ అవతరణ వేడుకలను బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
హైదరాబాద్: తమ పార్టీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారంనాడు హైద్రాబాద్ బీజేపీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని బండి సంజయ్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రసంగించారు. 25 ఏళ్ల క్రితమే తెలంగాణకు అనుకూంగా బీజేపీ తీర్మానం చేసిన విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదం బీజేపీ తీసుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
చిన్న రాష్ట్రాలతో పరిపాలన సౌలభ్యం నెలకొంటుందని బీజేపీ నమ్ముతుందన్నారు. ఈ కారణంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ మద్దతు పలికిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ బీజేపీ అనేక ఆందోళనలు నిర్వహించిన విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 1400 మంది యువకులు తమ ప్రాణాలను అర్పించుకున్నారని బండి సంజయ్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకొనేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. అన్ని విషయాల్లో తెలంగాణకు కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందని బండి సంజయ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు, సంక్షేమ పథకాలతోనే తెలంగాణలో అభివృద్ది సాగుతుందని బండి సంజయ్ వివరించారు.
తెలంగాణ అవతరణ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత సంబురంగా నిర్వహించుకుంటున్నారు. గోల్కోండ కోటలో కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.తెలంగాణ అవతరణ దినోత్సవాలను ఇవాళ్టి నుండి 21 రోజుల పాటు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.