కేసీఆర్ కు తృటిలో తప్పిన ప్రమాదం ... కాన్వాయ్ లోని పది కార్లు ఢీ

By Arun Kumar PFirst Published Apr 24, 2024, 7:55 PM IST
Highlights

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రమాదవశాత్తు కాలుజారి పడ్డ మాజీ సీఎం కేసిఆర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఆయన మరో ప్రమాదం నుండి తృటితో బయటపడ్డారు. 

నల్గొండ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ప్రమాదం తప్పింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ్టి నుండి కేసీఆర్ రాష్ట్ర పర్యటనను ప్రారంభించారు. ఇలా హైదరాబాద్ లోని బిఆర్ఎస్ కార్యాలయం నుండి ఇవాళ ఆయన ప్రచార యాత్ర ప్రారంభం అయ్యింది. అయితే తెలంగాణ భవన్ నుండి మిర్యాలగూడకు బయలుదేరిన కేసీఆర్ కాన్వాయ్ మార్గమధ్యలో ప్రమాదానికి గురయ్యింది. కానీ కేసీఆర్ కు గానీ,మిగతా బిఆర్ఎస్ నాయకులకు గానీ ఎలాంటి గాయాలు కాలేవు. అందరూ సురక్షితంగానే వుండటంతో బిఆర్ఎస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. 

ప్రమాదం ఎలా జరిగింది : 

తెలంగాణలోని అన్ని లోక్ సభ స్థానాలను చుట్టివచ్చేలా కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగానే ఇవాళ మొదటిరోజు మిర్యాలగూడ,  సూర్యాపేటలో రోడ్ షో నిర్వహించాల్సి వుంది. ఇందుకోసం కేసీఆర్ ప్రత్యేక బస్సులో బయలుదేరగా బిఆర్ఎస్ నాయకులు కార్లలో అనుసరించారు. అయితే ఈ కాన్వాయ్ నల్గొండ జిల్లా వేములపల్లి శివారుకు చేరుకోగానే ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. 

బిఆర్ఎస్ నాయకులకు చెందిన ఓ కారు సడన్ గా ఆగిపోవడంతో వెనకాల వున్న కార్లు దాన్ని ఢీకొన్నాయి. ఇలా దాదాపు పది కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాద సమయంలో కేసీఆర్ బస్సులో వున్నారు కాబట్టి ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గురయిన కార్లలోని వాళ్లకు కూడా ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

ప్రమాదానికి గురయిన కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో కేసీఆర్ పర్యటనకు   కొద్దిసేపు ఆటంకం కలిగింది. ఆ తర్వాత అక్కడినుండి కేసీఆర్ బస్సు మిర్యాలగూడకు చేరుకుంది... రోడ్ షో యధావిధిగా కొనసాగింది. 

 
 


 
 

click me!