నిజామాబాద్, సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. దీంతో అధికార పార్టీకి భారీగా షాక్ తగిలింది.
నిజామాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటినుంచి పార్టీలు ఫిరాయిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే అధికార బీఆర్ఎస్ కి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. నిజామాబాద్, సూర్యాపేట జిల్లాలో అధికార పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఈ రెండు జిల్లాల్లో ఇద్దరు మున్సిపల్ చైర్పర్సన్లు, పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరారు.
ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు చెందిన రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్పర్సన్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత కూడా బిఆర్ఎస్ కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆకుల లలిత కూడా కాంగ్రెస్లో చేరనున్నారని సమాచారం. సోమవారం నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ పద్మావతి, ఆమె భర్త తూము శరత్ రెడ్డితో పాటు మరో 9మంది కౌన్సిలర్లు టిఆర్ఎస్ కు రాజీనామా చేశారు.
వీరు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో హైదరాబాదులో సోమవారం నాడు కాంగ్రెస్లో చేరారు. నిజామాబాద్ ఎమ్మెల్యే షకీల్ వైఖరికి నిరసనగానే టిఆర్ఎస్ పార్టీని వీడినట్లుగా ఈ సందర్భంగా వారు తెలిపారు. ఇక ఆకుల లలిత కూడా సోమవారం సాయంత్రం సీఎం కేసీఆర్ కు తన రాజీనామా లేఖను పంపించారు. ఆకుల లలిత తాను రాసిన లేఖలో ఇన్నేళ్ల బిఆర్ఎస్ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం అయ్యాయని పేర్కొన్నారు.
జెడ్పిటిసిలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని.. వారి బాధలు వర్ణనాతీతం అని ఆ లేఖలో పేర్కొన్నారు. రాహుల్ యాత్ర సందర్భంగా ఆమె కాంగ్రెస్లోలో చేరనున్నారు. ఇక మరోవైపు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్, ఆమె భర్త రవి, మరో ముగ్గురు కౌన్సిలర్లు.. హుజూర్నగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే సైదిరెడ్డికి షాక్ ఇచ్చారు.
కెసిఆర్ దగ్గర సైదిరెడ్డి బిఫారం తీసుకున్న రోజే అర్చన రవి దంపతులు, కౌన్సిలర్లు గుంజె భవాని, అమరబోయిన సతీష్, వీర్లపాటి గాయత్రి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి నల్లగొండ ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. అర్చన రవి ఎమ్మెల్యే సైదిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు. దీంతో వారు పార్టీ మారడం హుజూర్నగర్ బిఆర్ఎస్ లో షాకింగ్ గా మారింది.
సైదిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన సమయంలోనే రవి కూడా రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటినుంచి ఇద్దరూ సన్నిహితులుగా పేరుపడ్డారు. అయితే, గత నాలుగు నెలల నుంచి రవి, సైదిరెడ్డిల మధ్య విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. హుజూర్నగర్ ఉపఎన్నిక తర్వాత నుంచే వీరి మధ్య విబేధాలు వచ్చినట్టుగా సమాచారం. ఆ ఎన్నిక తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్నగర్ మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులతో నియోజకవర్గ అభివృద్ధి కోసం చైర్పర్సన్, కౌన్సిలర్లు పనులు చేయాల్సి ఉంది.
అయితే సైదిరెడ్డి ఆ నిధులను మున్సిపాలిటీకి విడుదల చేయకుండా.. పబ్లిక్ హెల్త్ శాఖకు మళ్లించి సొంతంగా పనులు చేయించారు. ఇలా చేయడం.. నియోజకవర్గంలో తీవ్ర అసంతృప్తికి కారణంగా మారింది. అప్పటినుంచి.. కౌన్సిలర్లు, చైర్ పర్సన్.. ఎమ్మెల్యే సైదిరెడ్డిపై అసంతృప్తిగా ఉన్నారు. మున్సిపాలిటీ తీర్మానాలు కూడా పక్కనపెట్టి ఎమ్మెల్యే సైదిరెడ్డి తన సొంత ఎజెండా అమలు చేస్తున్నారంటూ అర్చన రవి ఆరోపిస్తున్నారు.
ఈ పరిణామాలపై ఎంపీ ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అధికార బిఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులకు ఎలాంటి గౌరవం ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మున్సిపాలిటీలకు, గ్రామపంచాయతీలకు ఇచ్చిన కోట్ల రూపాయల నిధులను అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు తాబేదారులకు అప్పగించి ప్రజాప్రతినిధులను పనిచేయనివ్వడం లేదని మండిపడ్డారు. అధికార ఎమ్మెల్యే సైదిరెడ్డి ఇప్పటికే వందల కోట్ల ప్రభుత్వ భూములను కబ్జా చేశారన్నారు.
ఒక్కో మద్యం దుకాణం దగ్గర నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకున్నారని ఆరోపణలు గుప్పించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలు నమ్మరని అన్నారు. కేసీఆర్ గతంలోకి ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ రాష్ట్రంలో 80 స్థానాల్లో విజయం సాధిస్తుందని అన్నారు.