తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చినా తిరిగి బిఆర్ఎస్ అధికారాన్ని ఏర్పాటుచేస్తుందంటూ గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేసారు.
పెద్దపల్లి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పార్టీలు ప్రచారపర్వాన్ని ప్రారంభిస్తే... మరికొన్ని పార్టీలు అభ్యర్థుల వేటలోనే వుండి కాస్త వెనకబడ్డాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో ప్రచార జోరు పెంచిన నాయకులు ప్రజల్లోకి వెళుతున్నారు. ఇలా రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కిన వేళ మాజీ ఆర్టిసి ఛైర్మన్ గోనె ప్రకాష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
తెలంగాణలో మళ్లీ బిఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చేపడుతుందని ప్రకాష్ రావు జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 60 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని మెజారిటీ సాధించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని... కానీ బిఆర్ఎస్ కు 50 సీట్లు వచ్చినా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు అరకొర మెజారిటీ సరిపోదని... బంపర్ మెజారిటీ సాధించాల్సి వుంటుందని మాజీ ఆర్టిసి ఛైర్మన్ అన్నారు.
Read More కాంగ్రెస్ నేతల్లో విభేదాలు! బీసీలను రేవంత్ అవమానించాడు, బుద్ధి చెప్తాం: నాగం.. ‘జూపల్లిని ఓడిస్తా..’
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 55 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిందని... అందులో బిసిలకు తగిన ప్రాధాన్యత దక్కలేదని ప్రకాష్ రావు అన్నారు. మొదటి జాబితాలో కేవలం 12మంది బిసి లకే సీట్లు దక్కడం బాధాకరమని అన్నారు. ఇప్పటికే బిసిలకు రాజకీయంగా అన్యాయం జరిగింది... కాబట్టి వారిని తగిన ప్రాధాన్యత ఇవ్వాలని రాజకీయ పార్టీలను ప్రకాష్ రావు కోరారు.