అలంపూర్, నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థుల విషయంలో ఇంకా సందిగ్థత తొలగలేదు. ఈ రెండు నియోజకవర్గాలతో పాటు హైదరాబాద్ లోని మరో 8 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ... బీఆర్ఎస్ ఇప్పటికే 109 మంది అభ్యర్థులకు బీఫాంలు అందజేసి అన్ని పార్టీలకంటే ఎన్నికల సన్నాహాల్లో ముందే ఉంది. అయితే, ఇంకా రెండుస్థానాల్లో మాత్రం క్లారిటీ రాలేదు. నర్సాపూర్, అలంపూర్ నియోజకవర్గాలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన తొలి విడత అభ్యర్థుల జాబితాలో అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే అబ్రహం పేరు కూడా ఉంది.
అయితే, ఇప్పటికే అభ్యర్థులకు బీఫాంలు కూడా అందజేసిన సీఎం.. అబ్రహంకు మాత్రం బీఫామ్ ఇవ్వలేదు. అబ్రహం అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వ్యతిరేకిస్తున్నట్లుగా సమాచారం. మరో అభ్యర్థికి బిఫామ్ ఇచ్చేలా అధిష్టానంపై చల్లా వెంకట్రామిరెడ్డి ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తోంది తొలి విడత జాబితాలో ప్రకటించినట్లుగా తనకే బీఫామ్ ఇవ్వాలని అబ్రహం కూడా బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్, మంత్రి హరీష్ రావులను కలిసి విన్నవించారు.
నేడు న్యూఢీల్లీకి కిషన్ రెడ్డి: బీజేపీ సెకండ్ లిస్ట్‌పై కసరత్తు
తొలి విడత అభ్యర్థుల జాబితాలో కొన్ని స్థానాలను హోల్డ్ లో పెట్టారు. అవే జనగామ, గోషామహల్, నర్సాపూర్, నాంపల్లి నియోజకవర్గాలు. అయితే ఇప్పటికే జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డి కి బీఫామ్ అందింది. ఇక నర్సాపూర్ నియోజకవర్గంలో నుంచి సునీత లక్ష్మారెడ్డి అభ్యర్థిత్వాన్ని అధిష్టానం దాదాపుగా ఖరారు చేసిందని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, ఈ సీటు మీద ప్రస్తుత ఎమ్మెల్యే మదన్ రెడ్డి వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకే మళ్లీ సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో నర్సాపూర్ నియోజకవర్గంలో సందిగ్థత నెలకొంది.
ఒకటి రెండు రోజుల్లో ఇక్కడ అభ్యర్థుల విషయంలో కెసిఆర్ తుది నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇక హైదరాబాదులో నాంపల్లి, గోషామహల్ నియోజకవర్గం అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మొత్తంగా.. 119 నియోజకవర్గాలకు గాను ఇప్పటికే 109 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో.. ఇంకా అలంపూర్, నర్సాపూర్, నాంపల్లి, చార్మినార్, గోషామహల్, చాంద్రాయణగుట్ట, మలక్పేట, బహదూర్పురా, యాకుత్పురా, కార్వాన్లను కలుపుకుని మొత్తం పది నియోజకవర్గాల్లో అభ్యర్థులకు బీఆర్ఎస్ ఇంకా బీఫాంలు అందించాల్సి ఉంది.