తెలంగాణలో కార్పొరేషన్ ఎన్నికలకు సన్నాహాలు... ఏర్పాట్లలో ఈసీ బీజీ

By Siva KodatiFirst Published Apr 7, 2021, 3:55 PM IST
Highlights

తెలంగాణలో కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధమవుతోంది ఎన్నికల సంఘం. సాగర్ ఉప ఎన్నిక ముగిశాక నోటిఫికేషన్ వచ్చే అవకాశం వుంది. ఈ నెలాఖరులో ఎన్నికలు నిర్వహించే యోచనలో ఎస్ఈసీ ఉన్నట్లుగా తెలుస్తోంది

తెలంగాణలో కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధమవుతోంది ఎన్నికల సంఘం. సాగర్ ఉప ఎన్నిక ముగిశాక నోటిఫికేషన్ వచ్చే అవకాశం వుంది. ఈ నెలాఖరులో ఎన్నికలు నిర్వహించే యోచనలో ఎస్ఈసీ ఉన్నట్లుగా తెలుస్తోంది.

మరోవైపు కార్పొరేషన్ ఎన్నికలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. ఎన్నికలు జరిగే ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పటికే దిశా నిర్దేశం చేశారు. సాగర్ ఎన్నికలు పూర్తవగానే అక్కడి నుంచి నేరుగా సొంత జిల్లాలకు వెళ్లి కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధుల విజయానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఇప్పటికే పురపాలక ఎన్నికల కోసం రిజర్వేషన్ల అంశం, వార్డుల విభజన, ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాపై ఎస్ఈసీ క్లారిటీ ఇచ్చింది. వార్డుల విభజన సైతం పూర్తి చేసింది.

గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల పాలక మండలి గడువు మార్చి 21తో ముగిసింది. సిద్ధిపేట పాలక మండలి గడవు ఈనెల 15తో పూర్తవుతోంది.

కాగా, నేడు పోలింగ్ కేంద్రాల ముసాయిదా తయారీ చేసి ఎనిమిదిన ప్రచురించాలని ఎన్నికల కమీషన్ నిర్ణయించింది. దానిపై 11వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరించి, వాటిని పరిష్కరించాక 14వ తేదీన తుది పోలింగ్ కేంద్రాలను ప్రకటించాల్సి ఉంది.

ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డుసభ్యుల స్థానాల్లోనూ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 
 

click me!