
విద్యా శాఖ అధికారులపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పేపర్ లీక్, రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఆమె అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీరియస్‌గా లేకుంటే ఉద్యోగాలు పోతాయని వార్నింగ్ ఇచ్చారు. అక్రమాలకు పాల్పడ్డ వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
అంతకుముందు రాష్ట్రంలో టెన్త్ పరీక్షా పత్రాల లీకేజ్ వ్యవహారంపై స్పందించారు సబితా ఇంద్రారెడ్డి. ఈ మేరకు ఆమె మంగళవారం ట్వీట్ చేశారు. ‘‘పదవ తరగతి పరీక్షల విషయంలో జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలు, పోలీస్ విభాగంగా, పోస్టల్ డిపార్ట్‌మెంట్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. నాలుగు లక్షల 95 వేల మంది విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బాధ్యతగా పనిచేద్దామని తెలియజేసుకుంటున్నాను. మొదటిసారి బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్న చిన్నారులను గందరగోళ పరిస్ధితులకు గురిచేయడానికి ఎవరు ప్రయత్నించినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. విద్యార్ధుల పరీక్షల విషయంలో రాజకీయ స్వార్ధం, వ్యక్తిగత స్వార్ధం పక్కనపెట్టాలని మనవి ’’ అంటూ సబితా ఇంద్రారెడ్డి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాగా.. తెలంగాణ పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్న వేళ చోటుచేసుకుంటున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలి రోజే.. వికారాబాద్ జిల్లాలో పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూపులో ప్రత్యక్షం కావడం సంచలనం సృష్టించింది. తాజాగా ఈరోజు వరంగల్‌లో పదో తరగతి హిందీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్టుగా తెలుస్తోంది. ఉదయం 9.30 గంటలకే ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. వాట్సాప్ గ్రూప్‌ల్లో ప్రశ్నపత్రం వైరల్ కావడంతో.. విషయం తెలుసుకన్న అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ప్రశ్నపత్రం ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అయితే ఈ ప్రశ్నాపత్రం ఒర్జినలా? నకిలీనా అనేది కూడా తెలియాల్సి ఉందని అంటున్నారు. ఈ పరిణామాలపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.