
బాసర ట్రిపుల్ ఐటీ (basara iiit) విద్యార్థుల ఆందోళనలపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (sabitha indra reddy) స్పందించారు. సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, ఆందోళన విరమించాలని కోరుతూ విద్యార్థులకు ఆమె శనివారం లేఖ రాశారు. విద్యార్థుల సమస్యలను తక్కువ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఆందోళనలతో ఇబ్బంది పడుతున్నారని సబిత ఆవేదన వ్యక్తం చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ రాజకీయాలకు వేదిక కావొద్దని... విద్యార్థుల ఆందోళనలు చూస్తే మంత్రిగా, ఓ అమ్మగా బాధేస్తోందన్నారు. సమస్యల పరిష్కారం కోసం డైరెక్టర్‌ని నియమించామని.. ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ వెంకట రమణను ప్రభుత్వం మీ వద్దకు పంపిందని సబిత తెలిపారు. ఇది మీ ప్రభుత్వమని దయచేసి చర్చించాలని విద్యాశాఖ మంత్రి లేఖలో తెలిపారు.
యూనివర్సిటీ సమస్యలు తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని ఆమె స్పష్టం చేశారు. ఏ వర్సిటీలో లేని విధంగా బాసరలో స్టూడెంట్ ఆర్గనైజేషన్ కమిటీ ఉందని, ఈ కమిటీ, యూనివర్సిటీ కమిటీ చర్చించుకుని పరిష్కరించుకోవాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు. కరోనా వల్ల రెండేళ్లు సమస్యలు పరిష్కరించడంలో జాప్యమయిందని ఆమె పేర్కొన్నారు. అత్యున్నత సంస్థ ప్రతిష్టకు భంగం కలగవద్దని సబిత ఇంద్రారెడ్డి విద్యార్ధులకు సూచించారు.
ALso Read:బాసర ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న ఆందోళన.. విద్యార్ధులను చర్చలకు పిలిచిన అధికారులు
మరోవైపు.. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వెనక్కి తగ్గడం లేదు. వర్సిటీలో సమస్యలు పరిష్కరించాల్సిందేనంటూ ఆందోళన చేస్తున్నారు. అధికారులు నచ్చజెప్పినా ఖాతరు చేయడం లేదు. దీంతో వారిని దారికి తెచ్చుకునేందుకు విద్యుత్తు, మంచినీటి సరఫరా బంద్ చేసినా ఫలితం లేకపోయింది. విద్యార్థులు మరింత పట్టుదలతో ఆందోళన నిర్వహించడంతో ఆ సౌకర్యాలను అధికారులు పునరుద్ధరించక తప్పలేదు. వర్సిటీలో రెగ్యులర్ వీసీ నియామకమే తమ ప్రధాన డిమాండ్ అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీకి ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) వచ్చి తమ సమస్యలు విని.. పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు తేల్చిచెబుతున్నారు. ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో వర్సిటీ పరిసరాలతో పాటు బాసరలో భారీగా పోలీసులను మోహరించారు.