నక్సలైట్ అవుదామనుకున్నా .. గన్ను పట్టాల్సింది, పెన్ను పట్టాకున్నా : డీహెచ్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Feb 12, 2023, 7:19 PM IST
Highlights

తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను విద్యార్ధిగా వున్నప్పుడు మావోయిస్ట్ ఉద్యమంలోకి వెళదామనుకున్నానని వ్యాఖ్యానించారు. అడవికి పోయి ఉంటే ఎప్పుడో అమరుడిని అయ్యేవాడినని డీహెచ్ పేర్కొన్నారు.
 

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాచలం ఏరియాలో మావోయిస్టుల బాటలో పెరిగానని అన్నారు. మావోయిస్టుల విధానాలకు ఆకర్షితుడినై దళంలో చేరాలనుకున్నానని డీహెచ్ వ్యాఖ్యలు చేశారు. పెన్ను పట్టుకోకపోయుంటే.. గన్ను పట్టుకుని ఉద్యమం చేసేవాడినని ఆయన అన్నారు. అడవికి పోయి ఉంటే ఎప్పుడో అమరుడిని అయ్యేవాడినని డీహెచ్ పేర్కొన్నారు. గన్నులు వదిలేసి అంతా పెన్నులు పట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇదిలావుండగా.. గతేడాది డిసెంబర్‌లో కరోనాపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు దయవల్లే కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు. దేశ అభివృద్ధికి క్రైస్తవ మతమే కారణమన్నారు.

Also REad: రాజకీయాల్లో ఎంట్రీకి సిద్దమవుతున్న డీహెచ్ శ్రీనివాసరావు.. బీఆర్‌ఎస్‌లో చేరిక ఖాయమేనా..?

కాగా.. గత ఏడాది సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీలను ప్రగతి భవన్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, రామగుండంలో ఈ ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన డీహెచ్ శ్రీనివాసరావు కేసీఆర్‌కు పుష్పగుచ్చం ఇచ్చారు. 

కొన్ని సెకన్ల పాటు కేసీఆర్‌తో మాట్లాడి.. ఆయన కాళ్లకు నమస్కారం చేశారు.  కార్యక్రమం పూర్తైన తర్వాత కేసీఆర్ అక్కడి నుంచి వెళ్తున్న సమయంలో  కూడా ఆయన కాళ్లకు డీహెచ్ శ్రీనివాసరావు నమస్కారం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు వచ్చే అసెంబ్లీ  ఎన్నికల్లో టికెట్ కోసమే ఆయన ఇలా చేశారని సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక, గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలంలోని జిమ్నా తండాలో నిర్వహించిన పూజల్లో డీహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. తనను తాను దేవతగా చెప్పుకుంటున్న సుజాత నగర్ ఎంపీపీ విజయలక్ష్మితో కలిసి పూజల్లో పాల్గొన్న శ్రీనివాసరావు.. మంటల్లో నిమ్మకాయులు వేస్తున్న వీడియో కూడా బయటకువచ్చింది. ఆయన ఎంపీపీ చుట్టూ ప్రదక్షిణలు కూడా చేశారు. ఈ విషయం బయటకు రావడంతో డీహెచ్‌ శ్రీనివాస్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాను గిరిజన పూజలు మాత్రమే చేశానని డీహెచ్ శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు. స్థానికుల ఆహ్వానం తోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్​ మండలంలో జరిగిన పూజ కార్యక్రమానికి వెళ్లినట్లు చెప్పారు. తాను మూఢ నమ్మకాలను అసలే విశ్వసించనని చెప్పారు.  
 

click me!