హైదరాబాద్‌ను 100శాతం వ్యాక్సినేటెడ్ నగరంగా మార్చాలి: ప్రజలకు సీఎస్ సోమేశ్ కుమార్ విజ్ఞప్తి

By telugu teamFirst Published Aug 25, 2021, 3:23 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం చంద్రయాణ గుట్టలోని టీకా కేంద్రాలను సందర్శించారు. ప్రజలు టీకా వేసుకుని హైదరాబాద్‌ను 100 శాతం టీకా పంపిణీ పూర్తయిన నగరంగా నిలపాలని కోరారు. అందుకు ప్రజాప్రతినిధులూ ప్రజలను జాగృతం చేయాలని సూచించారు. అర్హులందరికీ టీకా వేయడానికి చేపడుతున్న ప్రత్యేక డ్రైవ్‌లు విజయవంతంగా సాగుతున్నాయని అధికారులు సీఎఎస్ సోమేశ్ కుమార్‌కు తెలిపారు.

హైదరాబాద్: ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలు టీకా వేసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. తమకు తాముగా టీకా కేంద్రాలకు తరలి వచ్చి వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. టీకా పంపిణీ  విజయవంతమవ్వడానికి ప్రజా ప్రతినిధులూ ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. హైదరాబాద్‌ను 100 శాతం వ్యాక్సినేటెడ్‌ నగరంగా మార్చాలని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ప్రత్యేక టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. చంద్రయాణ గుట్టలలోని పరివార్ టౌన్‌షిప్, ఉప్పుగూడ టీకా కేంద్రాలను సందర్శించారు.

ఆ ఏరియాల్లో టీకా పంపిణీ ఏ స్థాయిలో జరుగుతున్నదని అధికారులను సీఎస్ సోమేశ్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. ఈ కాలనీల్లో డోర్ టు డోర్ సర్వే పూర్తయిందని, ఇంకా సింగిల్ డోసు కూడా తీసుకోని వారిని గుర్తించినట్టు అధికారులు వివరించారు. నెలాఖరుకల్లా ఈ ఏరియాల్లో వంద శాతం టీకా పంపిణీ పూర్తవుతుందని స్థానిక ప్రతినిధులు సోమేశ్ కుమార్‌కు హామీనిచ్చారు. సీఎఎస్ సోమేశ్ కుమార్ సందర్శన కార్యక్రమంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్‌లు పాల్గొన్నారు.

అర్హులందరికీ తొలి డోసు టీకా వేయాలన్న లక్ష్యంతో జీహెచ్ఎంసీ, ఆరోగ్య శాఖ అధికారులు నగరంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కాలనీలవారీగా ఈ డ్రైవ్ చేపడుతూ డోర్ టు డోర్ సర్వే చేస్తున్నారు. కాలనీస్థాయిల్లో టీకా క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలోని 585 కాలనీల్లో డ్రైవ్ పూర్తయింది. ఈ కాలనీల్లో 100 శాతం పని పూర్తిచేసినట్టు అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా 47,104 మందికి తొలి డోసు, 7,304 మందికి మలి డోసు వేసినట్టు తెలిపారు. ఇందుకోసం 4,182 మంది సిబ్బంది జీహెచ్ఎంసీ నుంచి 1,639 మంది ఉద్యోగులు ఆరోగ్య శాఖ నుంచి పనిచేశారని వివరించారు. 594 వాహనాలను సంచార టీకా కేంద్రాలుగా వినియోగించుకున్నట్టు పేర్కొన్నారు.

click me!