తోడేళ్ల మందలాగా దాడి ఎందుకు?: టీఆర్ఎస్‌కి ఈటల ప్రశ్న

By narsimha lodeFirst Published Aug 25, 2021, 3:00 PM IST
Highlights

హుజూరాబాద్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీఆర్ఎస్ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోందని  మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. హుజూరాబాద్ లో గెలిచినా ఓడినా నష్టం లేనప్పుడు తోడేళ్ల మందలాగా ఎందుకు దాడి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 


కరీంనగర్: హుజురాబాద్‌లో గెలిచినా ఒడినా నష్టం లేనప్పుడు ప్రగతి భవన్, రంగనాయక సాగర్ నుండి  తోడేళ్ల మందలాగా ఎందుకు దాడి చేస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

బుధవారం నాడు ఈటల రాజేందర్ హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జమ్మికుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు.దళితుల కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. దళితులకు ఎన్ని చేసినా కేసీఆర్ ను నమ్మే పరిస్థితి లేదని రాజేందర్ చెప్పారు.  బీసీ, ఎస్టీ అధికారులను కూడ సీఎంవోలో నియమించాలని ఆయన కోరారు. సిద్దిపేట మంత్రి ఇక్కడే అడ్డా పెట్టాడన్నారు. 

ప్రభుత్వం ఇచ్చే రేషన్ కార్డులు, పెన్షన్ తీసుకొని తనకే ఓటు వేస్తారని ప్రజలు చెబుతున్నారన్నారు. భారీగా పోలీసులను మోహరించినా టీఆర్ఎస్  ఓటమి ఖాయమైందన్నారు. కేసీఆర్ ఎన్ని చేసినా కూడ ప్రజలు ఆయనను నమ్మేస్థితిలో లేరన్నారు.

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో  విజయం కోసం టీఆర్ఎస్, బీజేపీలు ఎత్తులకు పై ఎత్తు వేస్తున్నాయి. రెండు పార్టీల నేతలు  క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. 

ఈ అసెంబ్లీ స్థానం నుండి ఈటల రాజేందర్ 2009 నుండి వరుసగా విజయం సాధిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఆయన విజయం సాధించారు. టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన తర్వాత తొలిసారిగా బీజేపీ అభ్యర్ధిగా ఆయన బరిలోకి దిగుతున్నారు.

 


 
 

click me!