KCR: దేశ ప్ర‌గ‌తిపై దృష్టిపెట్ట‌ని కేంద్రం.. అన‌వ‌స‌రంగా రాష్ట్ర వ్య‌వ‌హారాల్లో జోక్యం: సీఎం కేసీఆర్‌

By Mahesh RajamoniFirst Published May 19, 2022, 9:57 AM IST
Highlights

Telangana CM KCR: కేంద్రంలో  అధికారంలో ఉన్న బీజేపీ స‌ర్కారు దేశ ప్ర‌గ‌తిపై దృష్టి సారించ‌డం లేద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర రావు (కేసీఆర్‌) ఆరోపించారు. అన‌వ‌స‌రంగా రాష్ట్ర వ్య‌వ‌హారాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటున్న‌ద‌ని విమ‌ర్శించారు. 
 

Panchayat raj system: తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్‌)  చీఫ్‌, రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర రావు (కేసీఆర్‌) మ‌రోసారి కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. దేశం ప్రగతి పథంలో పయనించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  కేంద్రంలో  అధికారంలో ఉన్న బీజేపీ స‌ర్కారు దేశ ప్ర‌గ‌తిపై దృష్టి సారించ‌డం లేద‌ని ఆరోపించారు. అన‌వ‌స‌రంగా రాష్ట్ర వ్య‌వ‌హారాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటున్న‌ద‌ని విమ‌ర్శించారు. దేశంలోని అనేక గ్రామాలు, పట్టణాల్లో ఇప్పటికీ విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు, సాగునీటి అవసరాల కోసం ప్రజలు వీధిన పడుతున్నారని, విద్య, ఉపాధి రంగాల్లో ఆశించిన వృద్ధి నమోదు కాలేదన్నారు. ఇలాంటి ముఖ్యమైన అంశాలపై కేంద్రప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని, రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని విమ‌ర్శించారు. 

పలు అంశాలపై చర్చించేందుకు కేబినెట్‌ సహచరులు, ఉన్నతాధికారులు హాజరైన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థను ప్రారంభించిన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేకుండా నేరుగా గ్రామాలకే నిధులను తరలించే విధానాన్ని కేంద్రం అనుసరిస్తోందని విమర్శించారు. ఢిల్లీ నుంచి నేరుగా స్థానిక సంస్థలకు జవహర్ రోజ్‌గార్ యోజన, పీఎం గ్రామ్ సడక్ యోజన, ఉపాధి పథకం (ఎన్‌ఆర్‌ఈజీఏ) తదితరాల కింద నిధులను బదిలీ చేయడంలో తప్పును ఆయ‌న ఎత్తి చూపారు. రాష్ట్రాలకు స్థానిక సమస్యలపై మాత్రమే అవగాహన ఉంది. న్యూఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం నేరుగా రోజువారీ కూలీలకు డబ్బులు పంపిణీ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. పంటల ఉత్పత్తి, తలసరి ఆదాయంలో ప్రధానంగా ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ స‌హా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల కంటే తెలంగాణ  అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్రం ఇచ్చిన నిర్ణయాలను, ప్రాధాన్యతలను కొందరు అపహాస్యం చేశారని ఆయన ఎత్తిచూపారు. రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ, అడవుల సంరక్షణపై సమీక్ష నిర్వహించడం వంటి అంశాల‌ను గురించి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పచ్చదనాన్ని పెంపొందించడంలో తెలంగాణ నేడు మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. గ్రీన్ ఫండ్ కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులంతా ప్రతినెలా రూ.100 నుంచి రూ.500 వరకు నిధులు అందజేస్తున్నారు. అలాగే స్థానిక సంస్థలలో 10 శాతం నిధులు హరితహారం కోసం కేటాయించడం తప్పనిసరిగా ఉంద‌ని పేర్కొన్నారు. 
మిషన్ భగీరథ పథకం అధ్వాన స్థితిలో ఉన్న తాగునీటి వ్యవస్థను గాడిలో పెట్టేందుకు దోహదపడింది. దేశంలోనే తెలంగాణ మినహా మరే రాష్ట్రంలోనూ ఇంటింటికీ తాగునీరు అందడం లేదన్నారు.

తెలంగాణలో నమోదైన విజయాలు, అభివృద్ధిపై పలు జాతీయ టెలివిజన్ ఛానళ్లు కార్యక్రమాలు ప్రసారం చేశాయని కేసీఆర్ చెప్పారు. “ తెలంగాణ అభివృద్ధి ప‌ట్ల చాలా  రాష్ట్రాలు ఆశ్చర్యానికి గురయ్యాయి.. దీనిపై వారు ఫోన్‌ కాల్స్  చేయడం ప్రారంభించారు.. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి గురించి ఆరా తీశారు. తక్కువ సమయంలో అపూర్వమైన వృద్ధిని సాధించాం' అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాత్రింబవళ్లు విద్యుత్‌ సరఫరా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ వంటి పథకాలను ఇతర రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాలనే డిమాండ్‌ పెరుగుతోందని ముఖ్యమంత్రి చెప్పారు. క‌ర్నాట‌క‌లోని రాయచూర్ ప్రజలు తమ నియోజకవర్గంలో తెలంగాణ పథకాలను అమలు చేయాలని లేదా తమ అసెంబ్లీ నియోజకవర్గాన్ని తెలంగాణలో కలపాలని తమ బీజేపీ ఎమ్మెల్యేను డిమాండ్ చేస్తున్నార‌ని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు రావడం పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.


 

click me!