వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను తెలంగాణ కాంగ్రెస్ మరింత వేగవంతం చేసింది. మూడో రోజు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలతో స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది.
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ బుధవారంనాడు హైద్రాబాద్ లోని ఓ హోటల్ లో సమావేశమైంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది.
మూడు రోజులుగా అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ ఎంపీ మురళీధరన్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఇచ్చిన జాబితాపై చర్చిస్తుంది. కాంగ్రెస్ టిక్కెట్ల కోసం వచ్చిన ధరఖాస్తులను తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ షార్ట్ లిస్ట్ చేసింది. 538 మంది అభ్యర్థుల జాబితాను తయారు చేసింది. ఈ జాబితాపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తుంది. స్క్రీనింగ్ కమిటీ సభ్యుల్లో జిగ్నేష్ మేవాని మాత్రం సమావేశానికి హాజరు కాలేదు. స్క్రీనింగ్ కమిటీతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క భేటీ అయ్యారు.
ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఒకరి కంటే ఎక్కువ పేర్లు వచ్చిన స్థానాల్లో ముగ్గురి పేర్లను ఇతర స్థానాల్లో ఒకరు లేదా ఇద్దరి పేర్లను స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేయనుంది. పీఈసీ ఇచ్చిన జాబితాతో పాటు సునీల్ కనుగోలు సర్వే నివేదిక, సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తుంది.
also read:నేడే తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ: 530 మందితో ఆశావాహుల జాబితా
స్క్రీనింగ్ కమిటీ కసరత్తును పూర్తి చేసిన తర్వాత సీల్డ్ కవర్లో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితాను అందించనుంది. రాష్ట్రంలోని సుమారు 25 నుండి 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి పేరు మాత్రమే వచ్చిందని సమాచారం. వాస్తవానికి ఈ నెల రెండో వారంలో అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 18 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో అభ్యర్థుల జాబితా విడుదల కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది. నిన్న ఎఐసీసీ కార్యదర్శులు, మాజీ మంత్రులు, డీసీసీ అధ్యక్షులతో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది. ఇవాళ ప్రదేశ్ ఎన్నికల కమిటీతో స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తుంది.ఈ సమావేశం ముగిసిన తర్వాత అభ్యర్థుల జాబితాపై నివేదికను కేంద్ర ఎన్నికల కమిటీకి అందించే అవకాశం ఉంది.