మద్యం దుకాణాలు తెరవడంపై కాంగ్రెసు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రెస్ మీట్లో బ్యాలెన్స్ తప్పి మాట్లాడారని జగ్గారెడ్డి అన్నారు.
హైదరాబాద్: తాగి చావండి, ప్రభుత్వ ఖజానా నింపండని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మద్యం దుకాణాలను తెరవడానికి అనుమతి ఇచ్చారని సంగారెడ్డి కాంగ్రెసు శాసనసభ్యుడు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ బుధవారంనాటి ప్రెస్ మీట్లో బ్యాలెన్స్ తప్పారని ఆయన అన్నారు. తమ పార్టీ చేపట్టిన రైతు దీక్షను చూసి కేసీఆర్ తట్టుకోలేకపోయారని ఆయన అన్నారు.
రాజకీయాలను గలీజ్ చేసింది కేసీఆర్ అని తెలంగాణ పిసిసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ డాక్టర్లను కూడా అవమానిస్తున్నారని ఆయన అన్నారు. సీఎం స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలు కావని ఆయన కేసీఆర్ వ్యాఖ్యలపై అన్నారు. ప్రతిపక్షాలను సన్నాసులని తిడుతున్నారని ఆయన అన్నారు.
undefined
మార్చి నెలలో వేలాది కోట్లు కాంట్రాక్టర్లకు, తన ఆంధ్ర దోస్తులకు కేసీఆర్ ఇచ్చారని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ ఒక్కరే ఎంపీగా ఉన్నారని ఆయన చెప్పారు. కేసీఆర్ కు వైన్ షాపులు తెరవడంపై ఉన్న సంతోషం రైతుల ధాన్యాలను కొనుగోలు చేయడంపై లేదని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెసుతో కలిసి టీఆర్ఎస్ పోటీ చేసినప్పుడు ఎన్ని సీట్లు వచ్చాయో కేసీఆర్ చెప్పాలని కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. పవర్ ఎవరికీ శాశ్వతం కాదని ఆయన అన్నారు. మాటలు కేసీఆర్ కే కాదు తమకు కూడా వచ్చుననని ఆనయ అన్నారు. తాము మాట్లాడడం ప్రారంభిస్తే కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉండలేరని ఆయన అన్నారు.
రైతులను తాలుగాళ్లు అని అన్నందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెసు సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. కేసీఆర్ మాటలను రైతులు గమనించాలని ఆయన అన్నారు. కేసీఆర్ పిట్టలదొర మాటలు మానుకోవాలని ఆయన అన్నారు.