కేసీఆర్‌కు కౌంటర్: ముఖ్యనేతలతో కుంతియా వ్యూహరచన

First Published Jun 25, 2018, 1:31 PM IST
Highlights

ముందస్తుకు ఎన్నికల వ్యూహం


హైదరాబాద్: ముందస్తు ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు రంగం సిద్దం చేసుకొంటున్నారు. తెలంగాణలోని డీసీసీ అధ్యక్షులతో పాటు పీసీసీ ముఖ్య నేతలతో కాంగ్రెస్ పార్టీ  తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా సమావేశం కానున్నారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు వంద రోజుల ప్రణాళికను ఇవ్వనున్నారు.

మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్‌లో ఆదివారం నాడు చేరారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ భవన్‌లో ఏర్పాటు చేసిన  సమావేశంలో  ముందస్తు  ఎన్నికలపై తెలంగాణ సీఎం కేసీఆర్  సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ సిద్దంగా ఉందా అని కేసీఆర్ సవాల్ విసిరారు.

అయితే కేసీఆర్ సవాల్‌కు  కాంగ్రెస్ పార్టీ కూడ స్పందించింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడ స్పందించారు. తాము కూడ ముందస్తు ఎన్నికలకు  సిద్దంగా ఉన్నామని ఉత్తమ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

దరిమిలా తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో పాటు , డీసీసీ అధ్యక్షులతో  సోమవారం నాడు గాంధీ‌భవన్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా కూడ  హాజరవుతున్నారు. కుంతియాతో పాటు  ఎఐసీసీ నుండి మరో ముగ్గురు కొత్త కార్యదర్శులను  కాంగ్రెస్ పార్టీ నియమించింది.

ఒక్కొక్క ఇంచార్జీకి 40 అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించనున్నారు. అంతేకాదు వంద రోజుల ప్లాన్‌ను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఒకవేళ  టిఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు  సిద్దమైతే  కాంగ్రెస్ పార్టీ కూడ అందుకు సిద్ధపడాలని అనుకుంటోంది. ముందస్తు ఎన్నికల విషయమై కూడ  కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశంలో చర్చించనుంది.

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు  వెళ్ళాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారని  తెలుస్తోంది.  ఈ దిశగానే  ఆయన వ్యూహారచన చేస్తున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఎన్నికలకు వెళ్ళే ముందే ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు తమ పార్టీలోకి వచ్చేలా వలసలకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది.

ఈ విషయాలన్నింటిపై సోమవారం నాడు జరిగే సమావేశంలో చర్చించనుంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారంగా వచ్చే ఏడాది మేలో తెలంగాణలో ఎన్నికలు జరగాలి. ముందస్తుకు టీఆర్ఎస్ సిద్దమనే సంకేతాలను ఇస్తున్నందున  ఎన్నికలు ఈ ఏడాది చివర్లోనే జరిగే అవకాశాలు కూడ లేకపోలేదనే ప్రచారం కూడ సాగుతోంది. ఈ తరుణంలో ఎఐసిసి నియమించిన  ముగ్గురు కార్యదర్శులు వచ్చే ఎన్నికల్లో  పోటీ చేసే అభ్యర్ధుల ఎంపికలో కీలకంగా వ్యవహరించనున్నారు.

ముగ్గురు కార్యదర్శులు కూడ తమకు 40 చొప్పున కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. టీఆర్ఎస్‌తో పాటు ఇతర పార్టీలకు చెందిన అభ్యర్ధుల కంటే మెరుగైన అభ్యర్ధులు ఎవరనే విషయమై ఆరా తీస్తారు. గెలుపు గుర్రాలకు టిక్కెట్లను కేటాయించేలా వ్యూహలను రచిస్తున్నారు.
 

click me!