స్కీమ్ ల పేరుతో స్కాములు, కేసీఆర్ ను చూసి నవ్వాలో ఏడ్వాలో తెలియడం లేదు: విజయశాంతి

By Nagaraju penumalaFirst Published Sep 23, 2019, 10:04 AM IST
Highlights

కేసీఆర్ వాలకాన్ని చూస్తుంటే పథకాల పేరుతో ఆయన చేస్తున్న ఖర్చులు వాటి కారణంగా పెరుగుతున్న అప్పులను తీర్చేందుకు చివరకు మోడీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఒప్పందం కుదుర్చుకోవాలేమో? అంటూ విజయశాంతి సెటైర్లు వేశారు. 
 

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి. గత ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటూ సంక్షేమ పథకాల పేరుతో అరచేతిలో స్వర్గం చూపించారంటూ మండిపడ్డారు. 

స్కీముల పేరుతో స్కాములు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మూడు లక్షల కోట్ల అప్పుల్లో ముంచేశారంటూ కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం అప్పులపాల్జేసినందుకు నిలదీస్తే ఆ పాపం కేంద్రంలోని మోడీ ప్రభుత్వానిది గతంలో పాలించిన కాంగ్రెస్‌దే అంటూ గులాబీ బాస్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.  

కాంగ్రెస్ బిజేపీల వంటి జాతీయ పార్టీలకు కాలం చెల్లిందంటున్న కేసీఆర్ ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అవే జాతీయ పార్టీల చేతుల్లో ఎందుకు 7 సీట్లలో ఓడిపోయిందో చెప్పాలని నిలదీశారు.  

జాతీయ పార్టీలకు కాలం చెల్లిందంటున్న కేసీఆర్ ఇటీవల ఎదుర్కొన్న ఓటమిలపై ఆత్మ విమర్శ చేసుకుంటే బాగుంటుందని హితవు పలికారు. ఇప్పటికే మూడు లక్షల కోట్ల భారాన్ని మోయలేక తెలంగాణ ఆర్థిక శాఖ సతమతమవుతుంటే తెలంగాణలో కాంగ్రెస్‌తో పాటు బిజెపిని గల్లంతు చేసేందుకు మరో మూడు స్కీములు తన అమ్ముల పొదిలో ఉన్నాయని కెసిఆర్ ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన చూసి నవ్వాలో ఏడవాలో తెలియడం లేదంటూ సెటైర్లు వేఇశారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల పేరుతో మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన కేసీఆర్ కొత్తగా ప్రకటించబోతున్న స్కీమ్‌లకు ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేస్తారోనని ఆందోళన వ్యక్తం చేశారు. 

స్కీములు అమలుచేసే పేరుతో ఎన్ని కోట్ల స్కాంలకు పాల్పడతారో ఎవరికీ అంతుబట్టడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసిఆర్ కొత్త పథకాలను ప్రవేశపెట్టి వాటి పేర్లతో గనక మళ్లీ అప్పులు చేయడం మొదలుపెడితే కాంగ్రెస్ బీజేపీల మాట ఏమో కానీ అప్పుల బాధ తట్టుకోలేక ఈసారి తెలంగాణ ప్రజలు గల్లంతైపోయే ప్రమాదం ఉందన్నారు.

కేసీఆర్ వాలకాన్ని చూస్తుంటే పథకాల పేరుతో ఆయన చేస్తున్న ఖర్చులు వాటి కారణంగా పెరుగుతున్న అప్పులను తీర్చేందుకు చివరకు మోడీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఒప్పందం కుదుర్చుకోవాలేమో? అంటూ విజయశాంతి సెటైర్లు వేశారు. 

 

click me!