అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చారు.. ఇంకా ఎమ్మెల్యేలెందుకు: రాములమ్మ

By Siva KodatiFirst Published Mar 4, 2019, 8:52 AM IST
Highlights

గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వారి పార్టీలోకి ఆకర్షించడంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఫైర్‌బ్రాండ్ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు

గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వారి పార్టీలోకి ఆకర్షించడంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఫైర్‌బ్రాండ్ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌లో చేరిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆమె మండిపడ్డారు. వారిపై వెంటనే వేటు వేయాలని రాములమ్మ డిమాండ్ చేశారు. అప్పటికీ తమకు న్యాయం జరగకపోతే, పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు వెళ్లి, వారి తీరును అక్కడి ఓటర్ల ముందు ఎండగట్టేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధపడాలని ఆమె సూచించారు.

అసెంబ్లీలో స్పీకర్ సైతం తమకు సహకరించాలని, ఎలాంటి వివాదాలకు తావివ్వని రీతిలో నిష్పాక్షికంగా వ్యవహరించాలని ప్రజలు కోరుకుంటున్నట్లుగా రాములమ్మ తెలిపారు. ఇదే సమయంలో కాంగ్రెస్, టీడీపీల తరపున గెలిచిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారితే వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు.

ఈ విషయంలో ఎంతో హుందాగా వ్యవహరించాల్సిన స్పీకర్ వారిపై ఇంత వరకు చర్యలు తీసుకోలేన్నారు. ప్రజాస్వామ్యానికి, నైతిక విలువలను పక్కనబెట్టి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలపై శాసనమండలి ఛైర్మన్ ఫిర్మాదు అందిన వెంటనే వేటు వేశారని విజయశాంతి గుర్తు చేశారు.

ఈవీఎంలను అడ్డం పెట్టుకుని అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చి.. అది చాలదన్నట్లు ఇప్పుడు ప్రజాతీర్పును సైతం అవహేళన చేస్తూ..వారిని ఏదో రకంగా టీఆర్ఎస్‌లోకి చేర్చుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని ఆమె మండిపడ్డారు.

మరోవైపు ఫిరాయింపులపై విజయశాంతి పోరాటానికి దిగనున్నారు. దీనికి అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఇతర వివరాలను టీపీసీసీ వర్గాలు త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది.

విశ్వసనీయ వర్గాల సమచారం ప్రకారం.. పార్టీ ఫిరాయించిన కాంతారావు, ఆత్రం సక్కు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నిరసనక కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. 5న పినపాక, ఆసిఫాబాద్‌లలో ధర్నా, ఆందోళనలు నిర్వహించాలని శ్రేణులకు పిలుపునిచ్చింది.

click me!