
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దీంతో కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇటు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కర్ణాటక గెలుపు తెలంగాణ కాంగ్రెస్ గెలుపుకు నాంది అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నారు. కర్ణాటకలోని ఫలితాలే మళ్లీ తెలంగాణలోనూ కనిపిస్తాయని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు.ఈ ఫలితాలతో తమకు వెయ్యి ఏనుగుల బలం చేకూర్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గ్రామస్థాయి నుండి పట్టణ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలే తెలంగాణలో పునరావృతం కానున్నాయని కరీంనగర్ డిసిసి అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించి మిఠాయిలు పంచుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వైద్యులు అంజన్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్ టవర్ సర్కిల్ నుండి నగరంలోని ప్రధాన వీధులలో ర్యాలీ చేపట్టినారు. డీసిసి అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూర్ నియోజకవర్గంలోని నుస్తులాపూర్ నుండి కరీంనగర్ ఇందిరా చౌక్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించినారు. బాణాసంచా కాల్చి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
అలాగే.. కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరా చౌక్ వద్ద నగర ఏర్పాటు చేసిన విజయోత్సవ సంబరాల కార్యక్రమానికి మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, డిసిసి అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ గారితో పాటు పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు.
కాంగ్రెస్ జెండాలు చేత పట్టుకొని కర్ణాటక మాదే, తెలంగాణ మాదే అంటూ నినాదాలతో హోరెత్తించారు.
అలాగే.. వేములవాడ రాజన్న ఆలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. రాజన్న గుడి ముందు కొబ్బరి కాయలు కొట్టి, స్వీట్స్ పంపిణీ చేసి టపాసులు కాల్చారు కాంగ్రెస్ నేతలు. ఈ విజయోత్సవ సంబురాల్లో మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపి మత రాజకీయాలను ప్రజలు విశ్వసించడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ లో సీఎం కేసీఅర్ అమలు కానీ హామీలపై, బీజేపి మత రాజకీయలను తిప్పికొట్టే కాంగ్రెస్ అధికారం లోకి తీసుకవస్తామని దీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రజలు బీజేపీ నీ నమ్మలేదనీ, వేములవాడ రాజన్న సాక్షిగా చెబుతున్న బీజేపీ మత రాజకీయాలు బంద్ చేయండనీ, తెలంగాణ లో మత రాజకీయాలు వాడే ప్రయత్నం చేయకండని హితవు పలికారు. కర్ణాటక లో లాగే తామంత ఐక్యంగా ఉండి తెలంగాణ లో కాంగ్రెస్ అధికారం లో కి తీసుక వస్తామని అన్నారు.