కాంగ్రెస్ లో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు టిక్కెట్ల కేటాయింపులో పెద్ద పీట వేయాలని ఆ వర్గం నేతలు కోరుతున్నారు. ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు బుధవారంనాడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కలుస్తున్నారు.వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, సురేష్ షెట్కార్, మహేష్ కుమార్ గౌడ్,మధు యాష్కీ గౌడ్ లు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో వరుసగా సమావేశమౌతున్నారు. మంగళవారం నాడు ఇదే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీలోని బీసీ సామాజిక వర్గం నేతలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావును కలిశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి తమ డిమాండ్ ను వివరించారు.
రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రెండేసి అసెంబ్లీ స్థానాలను బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు మాత్రం తమ సామాజికవర్గానికి 48 అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశంలో బీసీ సామాజిక వర్గానికి 34 అసెంబ్లీ సీట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.
undefined
అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు టిక్కెట్ల కేటాయింపులో స్పష్టత లేదని అనుమానిస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్ గాంధీ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి గతంలో సూచించారు.ఈ విషయాన్ని బీసీ నేతలు గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్ గా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య వంటి నేతలకు చివరి నిమిషంలో టిక్కెట్టు కేటాయించారు. టిక్కెట్టు కోసం పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీలో అగ్రనేతల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
పార్టీలో కీలకంగా ఉన్న బీసీ నేతలకు కూడ టిక్కెట్ల కేటాయింపులో గ్యారెంటీ లేకపోతే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని నిన్న రాష్ట్ర నాయకత్వాన్ని అడిగారు. బీసీ సామాజిక వర్గం నేతలకు మెజారిటీ సీట్లు ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ అగ్రనేతలకు వివరించాలని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 50 శాతానికి పైగా బీసీ సామాజికవర్గం ప్రజలే ఉన్నారు. దీంతో బీసీ సామాజిక వర్గం నేతలకు టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.