6 నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారట.. అలా ఆలోచించారో మీ ఒంటికి మంచిది కాదు : బీఆర్ఎస్‌ నేతలకు రేవంత్ వార్నింగ్

By Siva KodatiFirst Published Jan 31, 2024, 9:30 PM IST
Highlights

ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారంటూ కొందరు కలలు కంటున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష నాయకులు శాపనార్థాలు పెడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారంటూ కొందరు కలలు కంటున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బుధవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన గద్దర్ జయంతి కార్యక్రమానికి సీఎం రేవంత్ , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని ఆలోచించడం వాళ్ల ఒంటికి, ఇంటికి మంచిది కాదని హెచ్చరించారు. ఇది ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వమని, రానున్న ఐదేళ్లు సుస్ధిరమైన పాలన అందించే బాధ్యత తమపై వుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష నాయకులు శాపనార్థాలు పెడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అలాగే సినీరంగానికి సంబంధించి నంది అవార్డుల స్థానంలో గద్ధర్ అవార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. నంది అవార్డులను పునరుద్ధరించాలని పలువురు సినీ ప్రముఖులు కోరారని.. ఈ క్రమంలోనే నంది అవార్డుల స్థానంలో గద్ధర్ పేరుతో అవార్డులు ఇస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కళాకారులకు గద్దర్ పేరుతో పురస్కారాలు అందించి ఆయనను గౌరవించుకుందామన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేస్తుందని, వచ్చే ఏడాది నుంచి ప్రతీ ఏడాది గద్ధర్ జయంతి రోజున కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ఈ పురస్కారాలను ప్రదానం చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 

Latest Videos

సమాజాన్ని చైతన్యం చేసేందుకు గద్దర్ గజ్జె కట్టి గళం విప్పారని. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఉద్యమం మొదలుపెట్టిన వ్యక్తి ఆయనేనని సీఎం గుర్తుచేశారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని మరోసారి గద్దర్ ఉద్యమం మొదలుపెట్టారని రేవంత్ రెడ్డి తెలిపారు. గద్దర్‌తో మాట్లాడితే తమకు 1000 ఏనుగుల బలం వస్తుందని, ఆ బలంతోనే గడీల ఇనుప కంచెలు బద్ధలుకొట్టామన్నారు. గద్ధర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని, కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 

click me!