కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు నెలలకో, ఆరు నెలలకో కేసీఆర్ సీఎం అవుతారని ఎవరైనా అంటే పళ్లు రాలగొడతామని రేవంత్ హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఇంద్రవెల్లిలో జరిగిన తెలంగాణ పునర్నిర్మాణ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్లు ఈ ప్రభుత్వం కూలుతుందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మూడు నెలలకో, ఆరు నెలలకో కేసీఆర్ సీఎం అవుతారని ఎవరైనా అంటే పళ్లు రాలగొడతామని రేవంత్ హెచ్చరించారు. 6 నుంచి 7 ఎంపీ సీట్లు వస్తే మళ్లీ మోడీకి అమ్ముకుంటారా అని సీఎం ప్రశ్నించారు.
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని రేవంత్ వెల్లడించారు. దేశంలో రెండే కూటములని.. ఒకటి మోడీ కూటమి అయితే, రెండోది ఇండియా కూటమి అన్నారు. మా కూటమిలోకి కేసీఆర్‌ను రానివ్వమని.. ఆ ఇంటి మీది పెట్ట ఈ ఇంటి మీద వాలితే కాల్చి పడేస్తామని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోయం బాపూరావుకు మంత్రి పదవి ఇచ్చారా.. మరి మోడీకి ఓటెందుకు వేయాలని సీఎం ప్రశ్నించారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆదివాసీలపై కాల్పులు జరిపినందుకు క్షమాపణలు కోరానని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. త్వరలోనే లక్ష మంది మహిళలకు రూ.500లకు సిలిండర్ ఇస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 7 వేల స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు భర్తీ చేశామని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణను విధ్వంస రాష్ట్రంగా మార్చారని సీఎం విమర్శించారు. కేసీఆర్ కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందా అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పు తెచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కాకుండానే బీఆర్ఎస్ నేతలు శాపనార్ధాలు పెడుతున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో కేసీఆర్ ఏం చేయలేదని, తాము 2 నెలల్లోనే చేయడం సాధ్యమవుతుందా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.