22 కార్లు కొని బెజవాడలో దాచారు , ఒక్కోటి రూ. 3 కోట్లు : కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

By Siva Kodati  |  First Published Dec 27, 2023, 3:32 PM IST

మూడో సారి సీఎం అయిన తర్వాత వాడుకోవడానికి కేసీఆర్ 22 ల్యాండ్ క్రూయిజర్ కార్లు కొన్నారని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కార్లను విజయవాడలో దాచి పెట్టారని.. ఒక్కో కారు విలువ రూ.3 కోట్లు వుంటుందని ఆయన తెలిపారు. 


ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి సచివాలయంలో ప్రజాపాలన లోగో, దరఖాస్తును సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఒకే దరఖాస్తుతో అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టారు. గ్రామ సభల్లో దరఖాస్తులు ఇవ్వలేకపోతే.. గ్రామ పంచాయతీలలో ఇవ్వొచ్చని సీఎం చెప్పారు. పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా వుంది అనేది ప్రజావాణి చూస్తేనే అర్ధమవుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

ప్రజావాణిలో అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని .. ప్రజలు హైదరాబాద్‌కు రాకుండా ప్రభుత్వమే ప్రజల దగ్గరికి పోవాలని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. దరఖాస్తుతో వివరాలు అందుతాయని ఎన్ని రోజుల్లో దానిని పరిష్కారం చేయగలుగుతామో తెలుస్తుందని.. ప్రతి మండలంలో రెండు గ్రూపులు వుంటాయని, ఒక గ్రూప్‌కి ఎండీవో, మరో గ్రూప్‌కి ఎమ్మార్వో బాధ్యత వహిస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎవరి కోసం ప్రజలు ఎదురుచూడాల్సిన అవసరం లేదని , ప్రభుత్వమే మీ దగ్గరకు వస్తుందని సీఎం పేర్కొన్నారు. 

Latest Videos

ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీఎస్‌పీఎస్సీ‌లో అందరూ రాజీనామా చేశారని, రాష్ట్రపతి అనుమతి వచ్చిన తర్వాత గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని సీఎం పేర్కొన్నారు. గవర్నర్ నిర్ణయం తర్వాత కమిటీని నియమించి, పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. లక్ష కోట్లలో సాయం చేశామని కేటీఆర్ అన్నారని.. ప్రజావాణి లక్ష్యం నెరవేరినట్లేనని, కేటీఆర్ లక్ష కోట్లను ప్రజలకు పంచుతామని సీఎం పేర్కొన్నారు.  

అధికారం కోల్పోవడంతో కేటీఆర్ విత్ డ్రాయల్ సింప్టమ్‌తో బాధపడుతున్నారని, మంచానికి కట్టేసి వైద్యం చేయించాల్సి వస్తుందని సెటైర్లు వేశారు. మేడిగడ్డలో ఎవరి పాత్ర ఏంటనేది తేల్చుతామని , కేసీఆర్ ఖజానా అంతా ఊడ్చుకుపోయాడని ఆయన మండిపడ్డారు. అందుకే శ్వేత పత్రం ఇచ్చామని.. మేడిగడ్డ అన్నారంపై విచారణ చేస్తున్నామని , ముందుంది మొసళ్ల పండుగ అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఎక్కడెక్కడి నుంచి నిధులు వస్తాయో ఆరా తీస్తున్నామని, కేంద్రాన్ని కూడా నిధులు అడిగామని సీఎం తెలిపారు.

వరంగల్ నుంచి సైనిక్ స్కూల్ ఎందుకు తరలిపోయిందో చెప్పాలని ముఖ్యమంత్రి నిలదీశారు. మూడో సారి సీఎం అయిన తర్వాత వాడుకోవడానికి కేసీఆర్ 22 ల్యాండ్ క్రూయిజర్ కార్లు కొన్నారని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కార్లను విజయవాడలో దాచి పెట్టారని.. ఒక్కో కారు విలువ రూ.3 కోట్లు వుంటుందని ఆయన తెలిపారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విషయం తెలియడానికి తనకు చాలా సమయం పట్టిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 
 

click me!